బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!

- August 14, 2026 , by Maagulf
బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!

దోహా: బరువు తగ్గేందుకు ఉపయోగించే మందులు, ఇంజెక్షన్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) నిపుణులు సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న స్లిమ్మింగ్ ఉత్పత్తులను డాక్టర్ల సలహా లేకుండా వినియోగించవద్దని హెచ్చరించారు. ఖతార్‌లో అధికారికంగా రిజిస్టర్ అయి, అనుమతి పొందిన మందులను లైసెన్స్ ఉన్న ఫార్మసీలు, ఆరోగ్య సంస్థల నుంచే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

MoPH ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగానికి చెందిన డాక్టర్ లతీఫా అల్-ఖయ్యత్ మాట్లాడుతూ.. ఏదైనా బరువు తగ్గించే మందు ఖతార్‌లో రిజిస్టర్ అయిందో లేదో మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దేశంలో విక్రయానికి అనుమతించే ముందు మందులను సంబంధిత విభాగం పరిశీలించడంతో పాటు ప్రయోగశాలల్లో పరీక్షిస్తుందని చెప్పారు.   ఇతరులు ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పిన అనుభవాల ఆధారంగా మందులు కొనుగోలు చేయవద్దని అల్-ఖయ్యాత్ సూచించారు. సోషల్ మీడియాలో కనిపించే స్లిమ్మింగ్ ఉత్పత్తుల కంటే ఖతార్‌లో లైసెన్స్ పొందిన ఫార్మసీలు, ఆరోగ్య సంస్థల నుంచే మందులు తీసుకోవాలని చెప్పారు. ఏదైనా మందు లేదా చికిత్సా ఉత్పత్తిపై అనుమానం ఉంటే 16000 హెల్త్ సెక్టార్ హాట్‌లైన్ ద్వారా MoPH ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.

థెరప్యూటిక్ న్యూట్రిషన్, ఒబెసిటీ నిపుణురాలు డాక్టర్ ఆయిషా సక్ర్ మాట్లాడుతూ.. బరువు తగ్గించే ఇంజెక్షన్లను వ్యక్తులు తమకు తాముగా ఎంచుకుని ఉపయోగించడం సరికాదని హెచ్చరించారు. ఒబెసిటీ చికిత్సకు ముందు రోగి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు. అవసరాన్ని బట్టి ఇంటర్నల్ మెడిసిన్, ఎండోక్రైనాలజీ నిపుణులు, పోషకాహార నిపుణులు, ఫార్మసిస్టులు, ల్యాబొరేటరీ నిపుణులతో కూడిన వైద్య బృందం రోగిని పరిశీలించవచ్చని చెప్పారు. చికిత్సకు ముందు రక్తంలో చక్కెర స్థాయులు, కాలేయ ఎంజైములు, థైరాయిడ్ పనితీరు వంటి పరీక్షలు అవసరం కావచ్చని వివరించారు. రోగి బాడీ మాస్ ఇండెక్స్ (BMI), డయబెటిక్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, సంతానోత్పత్తి, కీళ్ల సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులతో చికిత్స అవసరమా అనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తాము ఉపయోగించిన స్లిమ్మింగ్ ఇంజెక్షన్లను ఇతరులకు సిఫార్సు చేయడం కూడా సరికాదని ఆమె స్పష్టం చేశారు.

 ‘Retatrutide’ వినియోగంపై హెచ్చరిక

ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న Retatrutide ఇంజెక్షన్‌పై కూడా డాక్టర్ సక్ర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న బరువు తగ్గించే మందు. Eli Lilly సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ మందుతో గణనీయమైన బరువు తగ్గుదల నమోదైనప్పటికీ, Retatrutideకు ఇప్పటివరకు ఏ నియంత్రణ సంస్థ కూడా అధికారిక అనుమతి ఇవ్వలేదు. ప్రజల సాధారణ వినియోగానికి ఇది ప్రస్తుతం అందుబాటులో లేదని Eli Lilly వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారికి మాత్రమే ఈ మందును ఉపయోగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ వెలుపల Retatrutide పేరుతో విక్రయించే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కంపెనీ హెచ్చరించింది.  

విదేశాల నుంచి లేదా అనధికారిక విక్రేతల ద్వారా బరువు తగ్గించే ఇంజెక్షన్లు కొనుగోలు చేయవద్దని డాక్టర్ సక్ర్ సూచించారు. అధిక డిమాండ్ కారణంగా నకిలీ, నాసిరకం లేదా నమ్మదగని మందులు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త బరువు తగ్గించే మందులు ఖతార్‌లో అవసరమైన నియంత్రణ ప్రక్రియను పూర్తి చేసి అధికారిక అనుమతి పొందిన తర్వాతే వినియోగించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com