వన్డే ప్రపంచకప్‌ పై ఐసీసీ సంచలన నిర్ణయం!

- August 16, 2026 , by Maagulf
వన్డే ప్రపంచకప్‌ పై ఐసీసీ సంచలన నిర్ణయం!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించనున్న 2027 పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఒక విశేషమైన వార్త వెలుగులోకి వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా, ఈ మెగా టోర్నీని ఆయన జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించాలని ఐసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్‌ను గాంధీ జయంతి రోజున ప్రారంభించడం ద్వారా ఆయనకు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు.

గాంధీజీకి నివాళిగా అక్టోబర్ 2న బోణీ!
దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ చేసిన పోరాటం చారిత్రాత్మకం. తన జీవితంలో 21 సంవత్సరాలు (1893-1914) అక్కడే గడిపిన గాంధీజీ, సత్యాగ్రహ ఉద్యమానికి బీజం వేసింది కూడా ఆ గడ్డపైనే. దక్షిణాఫ్రికాలో గాంధీజీ సాగించిన పోరాటం, ఆయన అహింసా సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకుని ఆ దేశ జాతిపిత నెల్సన్ మండేలా తదనంతర కాలంలో ఉద్యమాన్ని సాగించారు. ఈ చారిత్రాత్మక బంధాన్ని స్మరించుకుంటూ ప్రపంచకప్‌ను ఆయన జయంతి రోజున ప్రారంభించడం సముచితంగా ఉంటుందని ఆతిథ్య దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి.

2027 ICC ODI World Cup: 14 జట్లు, 54 మ్యాచ్‌లు.. 2003 నాటి ‘సూపర్ సిక్స్’ ఫార్మాట్‌లో రీ-ఎంట్రీ!
ఈసారి 2027 ప్రపంచకప్ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేశారు. గత టోర్నీలో 10 జట్లు పాల్గొనగా, ఈసారి 14 జట్లతో నిర్వహించనున్నారు. వీటిని ఏడు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధిస్తాయి. 2003 ప్రపంచకప్ తరహాలో ఈ ఫార్మాట్‌ను మళ్లీ ప్రవేశపెడుతుండటం విశేషం.

ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు టోర్నీలో నేరుగా ప్రవేశం లభించగా, నమీబియా మాత్రం క్వాలిఫయర్స్‌ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. మొత్తం 54 మ్యాచ్‌లను జోహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌, డర్బన్‌తో పాటు హరారే, విండ్‌హోక్ వంటి ప్రముఖ వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రసార హక్కులు, మ్యాచ్‌ల షెడ్యూలింగ్ ఖరారైన తర్వాత ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com