గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- August 28, 2026
మనామా: సైబర్ ముప్పులు దేశాల సరిహద్దులను దాటి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల మధ్య సైబర్ భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు బహ్రెయిన్ కీలక అడుగు వేసింది. గల్ఫ్ ప్రాంతంలోని ఆరు దేశాల డిజిటల్ భద్రతా వ్యవస్థలను సమన్వయం చేసే దిశగా సమావేశం నిర్వహించింది. బహ్రెయిన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ సల్మాన్ బిన్ మహమ్మద్ అల్ ఖలీఫా అధ్యక్షతన మనామాలో జీసీసీ మంత్రుల సైబర్ సెక్యూరిటీ కమిటీ ఐదో సమావేశం జరిగింది. 46వ జీసీసీ సెషన్‌కు బహ్రెయిన్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెమ్ మహమ్మద్ అల్ బుదైవి కూడా సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశం సాధారణ చర్చా వేదిక కాదని, గల్ఫ్ దేశాల డిజిటల్ ఐక్యతకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని షేక్ సల్మాన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సైబర్ ముప్పులను ముందుగానే ఎదుర్కొనేలా ఉమ్మడి విధానాలు, సమన్వయంతో కూడిన చర్యలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక రంగం అత్యంత వేగంగా మారుతున్న నేపథ్యంలో జీసీసీ దేశాలు ఒకే గొంతుకతో, ఒకే విధమైన సైబర్ భద్రతా వ్యూహంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి విలువలను ఉమ్మడి రక్షణ వ్యవస్థలుగా మార్చడంతో పాటు.. ప్రతి దేశ ప్రయోజనాలను సమష్టి భద్రత, ప్రతిఘటన సామర్థ్యంగా మలచాలని సూచించారు.
సమావేశంలో జీసీసీ దేశాల ఉమ్మడి సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాలు, సమన్వయ విధానాలు సమీక్షించారు. భద్రమైన, విశ్వసనీయమైన గల్ఫ్ సైబర్‌స్పేస్‌ను నిర్మించేందుకు భవిష్యత్ కార్యాచరణ మార్గాలపై చర్చించారు. ప్రాంతీయ సుస్థిర అభివృద్ధికి డిజిటల్ భద్రతను కీలక ఆధారంగా మార్చే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







