భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- August 29, 2026
న్యూఢిల్లీ: భారత్, కువైట్ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. భారత్–కువైట్ సంయుక్త రక్షణ కమిటీ (JDC) తొలి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. భారత్ తరఫున జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, కువైట్ తరఫున బ్రిగేడియర్ జనరల్ రాయెద్ అల్‌సక్రాన్ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఇరు దేశాల మధ్య సైనిక శిక్షణ, సంయుక్త సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, స్టాఫ్ చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన–అభివృద్ధి వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 డిసెంబర్లో కువైట్ పర్యటన సందర్భంగా భారత్, కువైట్ మధ్య కుదిరిన రక్షణ సహకార అవగాహన ఒప్పందం (MoU) లక్ష్యాలను అమలు చేయడమే సంయుక్త రక్షణ కమిటీ సమావేశం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భారత్ ప్రతినిధి బృందంలో మూడు సాయుధ దళాలకు చెందిన అధికారులు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన–అభివృద్ధి సంస్థ (DRDO), ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. కువైట్ బృందానికి బ్రిగేడియర్ జనరల్ రాయెద్ అల్‌సక్రాన్ ఉన్నారు.
అమరవీరులకు కువైట్ అధికారి నివాళి
సమావేశానికి ముందు బ్రిగేడియర్ జనరల్ అల్‌సక్రాన్ న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి భారత అమరవీరులకు నివాళులర్పించారు. కువైట్ ప్రతినిధి బృందం DPSU భవన్‌ను కూడా సందర్శించింది. అక్కడ భారత రక్షణ పరిశ్రమ ప్రతినిధులతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించింది.
వ్యూహాత్మక సంబంధాలు
భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలు 1962లో ఏర్పడ్డాయి. చారిత్రక వాణిజ్య సంబంధాలు, భౌగోళిక సమీపం, సాంస్కృతిక అనుబంధాలు, కువైట్‌లోని భారీ భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల బంధానికి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2024 డిసెంబర్లో ప్రధాని మోదీ కువైట్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచారు. తాజాగా జరిగిన తొలి సంయుక్త రక్షణ కమిటీ సమావేశంతో ఈ భాగస్వామ్యంలో రక్షణ సహకారం మరింత కీలకంగా మారే అవకాశముందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







