భారత్‌–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!

- August 29, 2026 , by Maagulf
భారత్‌–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!

దుబాయ్‌: వేసవి సెలవుల రద్దీ ముగిసిన తర్వాత భారత్‌ నుంచి యూఏఈకి తిరిగి వచ్చే ప్రయాణికులకు విమాన టికెట్‌ చార్జీaల్లో భారీగా తగ్గింపు కనిపిస్తోంది. ఆగస్టు 30తో పోలిస్తే సెప్టెంబర్‌ 13న కొన్ని ప్రధాన మార్గాల్లో వన్‌వే టికెట్‌ ధరలు 64 శాతం వరకు తగ్గినట్లు తాజా ధరల పరిశీలనలో వెల్లడైందని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. భారత్‌లోని ఆరు ప్రధాన నగరాల నుంచి యూఏఈకి నడిచే నేరుగా వెళ్లే విమానాల చార్జీలను పరిశీలించగా.. ఆగస్టు 30తో పోలిస్తే సెప్టెంబర్‌ 13 టికెట్లు 49 నుంచి 64 శాతం వరకు చౌకగా ఉన్నాయి. 

ఆరు మార్గాల్లో అత్యల్ప సగటు టికెట్‌ ధర సుమారు Dh2,089 నుంచి Dh894కు తగ్గింది. అంటే దాదాపు 57 శాతం తగ్గుదల నమోదైంది. అత్యధిక తగ్గుదల బెంగళూరు మార్గంలో కనిపించింది. ఆగస్టు 30న అత్యల్ప నేరుగా వెళ్లే విమాన టికెట్‌ ధర సుమారు Dh2,513 ఉండగా, సెప్టెంబర్‌ 13న అది Dh914కు తగ్గింది. దీంతో ఒక్క ప్రయాణికుడు దాదాపు Dh1,600 వరకు ఆదా చేసుకోవచ్చు. ఢిల్లీ నుంచి టికెట్‌ ధరలు సుమారు Dh2,227 నుంచి Dh825కు తగ్గాయి. కోచి నుంచి ప్రయాణించే వారికి కూడా Dh1,200కుపైగా ఆదా అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 30, సెప్టెంబర్‌ 6, సెప్టెంబర్‌ 13 తేదీల్లో అందుబాటులో ఉన్న అత్యల్ప డైరెక్ట్‌ ఎకానమీ టికెట్లను పోల్చగా.. ఆగస్టు 30న ఆరు మార్గాల్లో సగటు అత్యల్ప ధర సుమారు Dh2,089గా ఉండగా.. సెప్టెంబర్‌ 6న Dh1,298కు, సెప్టెంబర్‌ 13న కేవలం Dh894కు పడిపోయింది.

హైదరాబాద్‌ నుంచి కూడా భారీ తగ్గింపు

హైదరాబాద్‌–యూఏఈ మార్గంలోనూ ధరలు గణనీయంగా తగ్గాయి. ఆగస్టు 30న అత్యల్ప డైరెక్ట్‌ టికెట్‌ ధర సుమారు Dh1,777గా ఉండగా.. సెప్టెంబర్‌ 6న Dh1,162, సెప్టెంబర్‌ 13న Dh758కు తగ్గింది. అంటే ఆగస్టు 30తో పోలిస్తే సెప్టెంబర్‌ 13న టికెట్‌ ధర దాదాపు 57 శాతం తక్కువగా ఉంది. ఇక ముంబై మార్గంలో తగ్గుదల శాతం ఇతర నగరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ.. ధర దాదాపు సగానికి చేరింది. ఆగస్టు 30న సుమారు Dh1,460గా ఉన్న అత్యల్ప టికెట్‌ ధర సెప్టెంబర్‌ 6న Dh1,057కు, సెప్టెంబర్‌ 13న Dh739కు తగ్గింది.

కేరళ ప్రయాణికులకు Dh1,200కుపైగా ఆదా

యూఏఈకి అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే కేరళ మార్గాల్లోనూ భారీగా ధరలు తగ్గాయి. కోచి నుంచి ఆగస్టు 30న అత్యల్ప డైరెక్ట్‌ టికెట్‌ ధర సుమారు Dh2,272గా ఉంది. సెప్టెంబర్‌ 6న అది Dh1,387కు, సెప్టెంబర్‌ 13న Dh1,057కు తగ్గింది. అంటే మధ్య సెప్టెంబర్‌ ప్రయాణం ఆగస్టు చివరితో పోలిస్తే 53 శాతానికిపైగా తగ్గింది. కోజికోడ్‌ నుంచి ఆగస్టు 30న సుమారు Dh2,285గా ఉన్న టికెట్‌ ధర సెప్టెంబర్‌ 6న Dh1,608కు, సెప్టెంబర్‌ 13న Dh1,070కు పడిపోయింది. దీంతో కోచి లేదా కోజికోడ్‌ నుంచి సెప్టెంబర్‌ 13న ప్రయాణించే వారు ఆగస్టు 30తో పోలిస్తే Dh1,200కుపైగా ఆదా చేయవచ్చు.

సెప్టెంబర్‌ 10 వరకు ఎందుకు ధరలు ఎక్కువ?

ట్రావెల్‌ ఏజెంట్ల ప్రకారం.. యూఏఈలో వేసవి సెలవులు ముగించుకుని తిరిగి వస్తున్న ప్రవాసుల కారణంగా సెప్టెంబర్‌ 10 వరకు విమానాలకు డిమాండ్‌ అధికంగా ఉండే అవకాశం ఉంది. పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడం, ఉద్యోగులు సాధారణ పని షెడ్యూల్‌కు చేరుకోవడం వంటి కారణాలతో కుటుంబాలు ఈ సమయంలో యూఏఈకి తిరిగి రావడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ రద్దీ తగ్గిన తర్వాత విమాన టికెట్‌ ధరలు సాధారణంగా తగ్గుతాయని ట్రావెల్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.

అయితే చౌకైన టికెట్ల కోసం వేచి చూసే ప్రయాణికులకు ఈ అవకాశం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని ట్రావెల్‌ ఏజెంట్లు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్‌ నుంచి దుబాయ్‌లో ఈవెంట్ల సీజన్‌ ప్రారంభం కావడంతో యూఏఈకి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో విమాన ప్రయాణానికి డిమాండ్‌ మళ్లీ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అక్టోబర్‌ చివరి నుంచి వాతావరణం చల్లబడటంతో యూఏఈలో శీతాకాల పర్యాటక సీజన్‌ కూడా ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ పర్యాటకుల రాక, ప్రధాన ఈవెంట్లు కలిసి విమాన టికెట్‌ ధరలను మళ్లీ పెంచే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణ తేదీల విషయంలో సౌలభ్యం ఉన్నవారు సెప్టెంబర్‌ మధ్యలో ప్రయాణాన్ని ఎంచుకుంటే గణనీయంగా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉందని ట్రావెల్‌ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com