పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!

- September 02, 2026 , by Maagulf
పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!

కువైట్ : పబ్లిక్ ప్రదేశాల్లో నిషేధిత ప్రాంతాల్లో స్మోకింగ్ చేసే వారిపై కువైట్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అల్-ముబారకీయా మార్కెట్‌లో పర్యావరణ పోలీస్ విభాగం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 30 ధూమపాన ఉల్లంఘన కేసులను నమోదు చేశారు. మూసివున్న, సెమీ-క్లోజ్డ్ ప్రదేశాల్లో స్మోకింగ్ చేసినందుకు 30 మందిపై కేసులు నమోదు చేయగా, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో కాకుండా పడేసినందుకు ఒక కేసు నమోదైంది. అలాగే తమ ప్రాంగణంలోకి వచ్చిన కస్టమర్లు ధూమపానం చేసేందుకు అనుమతించిన ఒక వ్యాపార సంస్థపై కూడా చర్యలు తీసుకున్నారు.

అన్ని ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడం, నిబంధనలకు విరుద్ధమైన చర్యలను అరికట్టడం, ప్రజా పరిశుభ్రతతో పాటు దేశ సుందర రూపాన్ని కాపాడటం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

జరిమానాలు ఎంతంటే?

నిషేధిత మూసివున్న లేదా సెమీ-క్లోజ్డ్ ప్రదేశాల్లో స్మోకింగ్ చేస్తే 50 నుంచి 100 కువైట్ దినార్ల (KD) వరకు జరిమానా. 
తమ ప్రాంగణంలో స్మోకింగ్ కు అనుమతించే వ్యాపార సంస్థలకు 1,000 నుంచి 5,000 KD వరకు జరిమానా. 
బహిరంగ ప్రదేశాల్లో చెత్తను నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా పడేస్తే 50 నుంచి 500 KD వరకు జరిమానా.

పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిషేధిత ప్రాంతాల్లో స్మోకింగ్ చేయకుండా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com