అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- September 02, 2026
యూఏఈ: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో యూఏఈలోని పాఠశాలలు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేస్తున్నాయి. జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు లేదా ఇతర అనారోగ్య లక్షణాలతో ఉన్న పిల్లలను పూర్తిగా కోలుకునే వరకు పాఠశాలకు పంపవద్దని సూచిస్తున్నాయి. ఆగస్టు 31న స్కూల్స్ ప్రారంభమయ్యాయి. అయితే పిల్లల ఆరోగ్యం, ఇతర విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనారోగ్యంతో ఉన్న పిల్లలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని పాఠశాలలు స్పష్టం చేస్తున్నాయి.
దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA), నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరోగ్య, భద్రతా నిబంధనలు అమలు చేస్తున్నట్లు పాఠశాలలు తెలిపాయి. అజ్మాన్‌లోని వుడ్లెమ్ బ్రిటిష్ స్కూల్ ప్రిన్సిపాల్ నటాలియా స్వెటెనోక్ మాట్లాడుతూ.. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్థవంతంగా నేర్చుకోగలరని అన్నారు. జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు, వాంతులు లేదా విరేచనాలు ఉన్న విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు ఇంట్లోనే ఉండటం సరైన నిర్ణయమని తెలిపారు. కొన్ని అంటువ్యాధుల సందర్భాల్లో వైద్య ధ్రువీకరణ పత్రం అవసరం కావచ్చని, అయితే ప్రతి చిన్న అనారోగ్యానికి అది అవసరం లేదని పేర్కొన్నారు.
పాఠశాలల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
తరగతి గదుల పరిశుభ్రత, సరైన గాలి ప్రసరణ, క్రమం తప్పని శానిటైజేషన్, వ్యక్తిగత పరిశుభ్రతపై పాఠశాలలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పిల్లల్లో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం పరస్పరం సమాచారం పంచుకోవడం ఎంతో ముఖ్యమని పాఠశాలలు పేర్కొన్నాయి. పిల్లలకు జ్వరం, కడుపు సంబంధిత సమస్యలు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా వ్యవహరించాలని తల్లిదండ్రులకు సూచించారు.
విద్యార్థుల ఆరోగ్య రక్షణలో భాగంగా పలు పాఠశాలలు టీకా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాయి. షార్జా ఇండియన్ స్కూల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే టీకా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తల్లిదండ్రుల నుంచి పిల్లల టీకా వివరాలను సేకరించి, అవసరమైన టీకాలు తీసుకోని విద్యార్థులను గుర్తిస్తారు. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలోనే టీకాలు వేయడానికి అవకాశం కల్పిస్తారు. కిండర్‌గార్టెన్ నుంచి సీనియర్ తరగతుల వరకు విద్యార్థులకు వయస్సు, అవసరాన్ని బట్టి వివిధ రకాల టీకాలు అందిస్తారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఇన్‌ఫ్లూయెంజా టీకా కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి.
తిరిగి స్కూల్‌కు ఎప్పుడు పంపాలి?
పలు పాఠశాలలు తల్లిదండ్రులకు స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి. పిల్లలకు ఈ లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఉంచాలని సూచించారు:
* 37.5 డిగ్రీల సెల్సియస్‌కు పైగా జ్వరం
* దగ్గు, గొంతు నొప్పి
* వాంతులు లేదా విరేచనాలు
* ముక్కు కారడం లేదా ముక్కు బ్లాక్ అవడం
* శరీర నొప్పులు
* కడుపు నొప్పి
* కంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు
* చర్మంపై దద్దుర్లు
జ్వరం తగ్గించే మందులు తీసుకోకుండా కనీసం 24 గంటల పాటు జ్వరం లేకుండా ఉన్న తర్వాతే పిల్లలను తిరిగి పాఠశాలకు పంపాలని సూచించారు. అలాగే వాంతులు లేదా విరేచనాలతో బాధపడిన పిల్లలు లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాత కనీసం 48 గంటల వరకు ఇంట్లోనే ఉండి, ఆ తర్వాతే స్కూల్‌కు వెళ్లాలని పాఠశాలలు స్పష్టం చేశాయి.
అనారోగ్యాన్ని ఎల్లప్పుడూ పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, పిల్లలకు కోలుకునేందుకు తగిన సమయం ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్యంతో పాటు ఇతర విద్యార్థులు, పాఠశాల సమాజాన్ని కూడా రక్షించవచ్చని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







