కువైట్‌లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!

- September 06, 2026 , by Maagulf
కువైట్‌లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!

కువైట్:కువైట్‌లో జువైనల్ క్రైమ్స్  తగ్గుముఖం పట్టాయి. 2026 తొలి ఆరు నెలల్లో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే జువైనైల్ నేరాలు 48 శాతం తగ్గినట్లు న్యాయశాఖ మంత్రి కౌన్సిలర్ నాసర్ అల్-సుమైత్ వెల్లడించారు. 2025 తొలి అర్ధభాగంలో 1,523 బాల నేరాల కేసులు నమోదుకాగా, 2026లో ఆ సంఖ్య 795కు తగ్గిందని తెలిపారు. 2024 తొలి ఆరు నెలల్లో నమోదైన 1,665 కేసులతో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య 52 శాతం తగ్గినట్లు మంత్రి పేర్కొన్నారు.

అలాగే, ట్రాఫిక్‌కు సంబంధించిన కేసులు 63 శాతం తగ్గుదల నమోదైనట్లు పేర్కొన్నారు. 2025 తొలి ఆరు నెలల్లో 1,048 ట్రాఫిక్ కేసులు నమోదుకాగా.. 2026లో అదే కాలానికి ఈ సంఖ్య 383కు పడిపోయింది.అలాగే దాడులకు సంబంధించిన కేసులు కూడా 32 శాతం తగ్గినట్లు మంత్రి తెలిపారు.

జువైనల్ నేరాల తగ్గుదలకు ప్రభుత్వం తీసుకొచ్చిన పలు కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా ఒక కారణమని అల్-సుమైత్ పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక, నివారణ చర్యలు కూడా జువైనల్ క్రైమ్స్  తగ్గుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జువైనల్ నేరాల నివారణ, నియంత్రణలో కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

బాలల సంరక్షణ, పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్న సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా అభినందించారు. అలాగే కుటుంబ వ్యవహారాల సుప్రీం కౌన్సిల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు బాలలపై హింస, వేధింపులను నిరోధించడంలో కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. యువతను రక్షించడం, వారి హక్కులను కాపాడటం అందరి ఉమ్మడి బాధ్యత అని అల్-సుమైత్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖల సమన్వయంతో అవగాహన, నివారణ, రక్షణ, సంరక్షణ, పునరావాస కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com