కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!

- September 06, 2026 , by Maagulf
కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!

మనామా: బహ్రెయిన్–సౌదీ అరేబియా మధ్య ప్రయాణికులకు గుడ్ న్యూస్. కింగ్ ఫహద్ కాజ్‌వే మీదుగా ఇరు దేశాల లైసెన్స్ పొందిన ట్యాక్సీలు ప్రయాణికులను రవాణా చేసేందుకు అనుమతించారు. బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ.. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీలు ఈ మేరకు ప్రకటించారు. ఈ కొత్త విధానం ద్వారా బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య భూ రవాణా అవకాశాలు పెరగడంతో పాటు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

పౌరులు, నివాసితులు, సందర్శకులకు మరింత సౌకర్యవంతమైన రవాణా ఎంపికలు అందుబాటులోకి రానున్నాయని బహ్రెయిన్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ పోస్టల్ సర్వీసెస్ అండర్‌సెక్రటరీ ఫాతిమా అబ్దుల్లా అల్-ధయాన్ తెలిపారు. కాజ్‌వే మీదుగా ట్యాక్సీల రాకపోకలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన, సమర్థవంతమైన రవాణా సదుపాయాలు లభిస్తాయని అన్నారు.
అలాగే ఇరు దేశాల సంబంధిత అధికారుల మధ్య ఉన్న సన్నిహిత సహకారం ఈ సేవను ప్రారంభించడంలో కీలకంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా సౌదీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీతో సమన్వయం ద్వారా ట్యాక్సీ సేవలకు అవసరమైన నిబంధనలు, విధివిధానాలను రూపొందించినట్లు వెల్లడించారు.

కాగా, కింగ్ ఫహద్ కాజ్‌వేపై ట్యాక్సీల రాకపోకలు ఇరు దేశాలు ఆమోదించిన నిబంధనలు, అవసరాలకు అనుగుణంగా కొనసాగుతాయి. సేవలు సజావుగా సాగేందుకు బహ్రెయిన్, సౌదీ అధికార యంత్రాంగాలు పరస్పరం సమన్వయం చేసుకోనున్నాయి. ఈ నిర్ణయంతో బహ్రెయిన్–సౌదీ మధ్య ప్రయాణికుల రాకపోకలు మరింత సులభం కావడంతో పాటు, ఇరు దేశాల మధ్య రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com