సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!

- September 09, 2026 , by Maagulf
సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!

మనామా: సౌదీ అరేబియాపై హౌతీ దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. పౌరులు, ఆర్థిక, కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా పలువురు పౌరులు గాయపడటంపై బహ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందబ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, అంతర్జాతీయ నౌకాయానానికి హౌతీలు చేస్తున్న బెదిరింపులు ప్రమాదకర పరిణామానికి సంకేతమని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టం, ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్, సముద్ర చట్టంపై UN కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధమని బహ్రెయిన్ పేర్కొంది.

సౌదీ అరేబియా భద్రత అంటే గల్ఫ్ ప్రాంత భద్రతేనని బహ్రెయిన్ స్పష్టం చేసింది. సౌదీ సార్వభౌమత్వం, పౌరులు, నివాసితులు, కీలక మౌలిక సదుపాయాల రక్షణ కోసం ఆ దేశం తీసుకుంటున్న చర్యలకు బహ్రెయిన్ పూర్తి మద్దతు ప్రకటించింది. దాడులను ఎదుర్కొని పౌరుల ప్రాణాలను కాపాడుతున్న రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ అప్రమత్తత, సమర్థతను బహ్రెయిన్ ప్రశంసించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

బహ్రెయిన్ షూరా కౌన్సిల్ చైర్మన్ అలి బిన్ సలేహ్ అల్ సలేహ్, కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లమ్ కూడా సౌదీపై దాడులను ఖండించారు.సౌదీపై వచ్చే ముప్పులు బహ్రెయిన్‌తో పాటు మొత్తం GCC భద్రతపై ప్రభావం చూపుతాయని వారు పేర్కొన్నారు. హౌతీ ముప్పులను ఎదుర్కొనేందుకు గల్ఫ్ దేశాలు, అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com