యూఎన్- బహ్రెయిన్‌ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!

- September 09, 2026 , by Maagulf
యూఎన్- బహ్రెయిన్‌ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!

మనామా: బహ్రెయిన్‌లో ఐక్యరాజ్యసమితి (UN) భాగస్వామ్యంతో వివిధ కీలక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు 2025 కంట్రీ రిజల్ట్స్ రిపోర్ట్ వెల్లడించింది. 2025–2029 కాలానికి సంబంధించిన UN సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కోఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్ తొలి ఏడాది పురోగతిని ఈ నివేదిక సమీక్షించింది.

బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో జరిగిన జాయింట్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ప్రజలు (People), అభివృద్ధి (Prosperity), శాంతి (Peace), పర్యావరణం (Planet) అనే నాలుగు ప్రధాన ప్రాధాన్యతా రంగాల్లో సాధించిన ఫలితాలను నివేదికలో వివరించారు.

2025లో యూఎన్‌ మద్దతుతో ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, పాలన, మానవ హక్కులు, జెండర్ ఈక్వాలిటీ, యువత భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కార్యక్రమాలు చేపట్టారు. ఇవి బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030, ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కు అనుగుణంగా కొనసాగాయని బహ్రెయిన్‌లో యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఖలీద్ ఎల్ మక్వాద్ తెలిపారు.  ఈ భాగస్వామ్యం ద్వారా సామాజిక సమగ్రత బలోపేతమైందని, ఆర్థిక పరివర్తనకు మద్దతు లభించిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చర్యలు ముందుకు సాగడంతో పాటు సుస్థిర అభివృద్ధి కోసం భాగస్వామ్యాలు మరింత బలపడ్డాయని పేర్కొన్నారు.

251 మంది పారిశ్రామికవేత్తలకు మద్దతు

‘ప్రాస్పెరిటీ’ విభాగంలో భాగంగా పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే పలు కార్యక్రమాలను యూఎన్‌ చేపట్టింది. ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ప్రోగ్రామ్ ద్వారా 2025లో బహ్రెయిన్‌తో పాటు మరో నాలుగు దేశాలకు చెందిన 251 మంది పారిశ్రామికవేత్తలకు 13 కార్యక్రమాల ద్వారా సహాయం అందించారు. అలాగే BINOVATE 2025 కార్యక్రమంలో యూఎన్ భాగస్వామిగా వ్యవహరించింది. ఈ కార్యక్రమానికి 19 దేశాలకు చెందిన BNI చాప్టర్లు, 50కి పైగా ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.

మహిళల స్టార్టప్‌లకు ప్రోత్సాహం

సార్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ది క్రియేటివ్ ఆరెంజ్ ఎకానమీని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన గ్లోబల్ కాల్‌కు 78 దేశాల నుంచి 878 దరఖాస్తులు వచ్చాయి.

అదేవిధంగా స్టాండర్డ్ చార్టర్డ్ ఉమెన్ ఇన్ టెక్ ప్రోగ్రామ్ కు కూడా యూఎన్ మద్దతు అందించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు నిర్వహిస్తున్న 50కి పైగా స్టార్టప్‌లకు సహాయం అందించగా, 19 వెంచర్లకు కలిపి 3.05 లక్షల అమెరికన్ డాలర్లకు పైగా ప్రైజ్ మనీ పంపిణీ చేశారు.

యూఎన్ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బహ్రెయిన్‌లో చేపట్టిన కార్యక్రమాలతో పాటు, కొత్త సమన్వయ వ్యవస్థల ఏర్పాటును కూడా నివేదిక ప్రస్తావించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com