2027 నుంచి డీడబ్ల్యూసీకి ఫ్లైదుబాయ్ కార్యకలాపాలు..!!

- September 11, 2026 , by Maagulf
2027 నుంచి డీడబ్ల్యూసీకి ఫ్లైదుబాయ్ కార్యకలాపాలు..!!

దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) నుంచి అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DWC)కు విమాన కార్యకలాపాల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఫ్లైదుబాయ్ తొలి విమానయాన సంస్థగా కొంత కార్యకలాపాలను DWCకి తరలించే అవకాశం ఉంది. 2027లోనే సుమారు ఐదు నుంచి ఆరు విమానాలను DXB నుంచి DWCకి తరలించే అవకాశం ఉందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. దుబాయ్ మీడియా ఆఫీస్ నిర్వహించిన అంతర్జాతీయ మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. DXB నుంచి DWCకి మార్పు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా, కొన్ని నెలలు నుంచి కొన్ని సంవత్సరాల వ్యవధిలో జరుగుతుందని చెప్పారు.

DXB సామర్థ్యం త్వరలో పూర్తయ్యే అవకాశం

ప్రస్తుతం DXB సామర్థ్యం రానున్న కొన్నేళ్లలో పూర్తిగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రిఫిత్స్ పేర్కొన్నారు. ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థలు భవిష్యత్తులో మరింత విస్తరించాలంటే DWC అదనపు సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఫ్లైదుబాయ్ కార్యకలాపాలను DWCకి తరలించడం ద్వారా DXBలో కొన్ని స్లాట్లు ఖాళీ అవుతాయని, వాటిని ఇతర విస్తరణ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

వచ్చే ఏడాది రెండో రన్‌వే

అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండో రన్‌వే 2027లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయ్యే నాటికి DWCలో మొత్తం ఐదు రన్‌వేలు ఉండనున్నాయి. అయితే ఒకేసారి నాలుగు రన్‌వేలను మాత్రమే సాధారణంగా వినియోగిస్తారు. ఐదో రన్‌వేను అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచుతారు.

150 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం

ప్రారంభ దశలో రెండు రన్‌వేలే సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. DWC 150 మిలియన్ల ప్రయాణికుల వార్షిక సామర్థ్యాన్ని చేరుకునే వరకు ఇవే సరిపోతాయని గ్రిఫిత్స్ తెలిపారు. ఆ తర్వాత ప్రయాణికుల సామర్థ్యం పెరిగే కొద్దీ మూడో, నాలుగో రన్‌వేలను నిర్మిస్తారు. భవిష్యత్తులో DWC పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత DXBలోని అన్ని కార్యకలాపాలను DWCకి తరలించనున్నట్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com