జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్‌

- September 11, 2026 , by Maagulf
జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్‌

అమరావతి: కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (AE) టి.నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో పోలీసులు సాధిక్ ఖాన్‌ను కస్టడీకి తీసుకుని విచారించడంతో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.25 కోట్ల ఆస్తిని దక్కించుకోవాలనే దురాశతోనే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిందితుడు సర్పవరం పోలీసుల ఎదుట అంగీకరించాడు. కోర్టు అనుమతితో నిందితుడిని మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు, తొలి రెండు రోజులు అతడు చెప్పిన అబద్ధాలను పక్కా సాంకేతిక ఆధారాలతో తిప్పికొట్టారు: సాధిక్‌కు సైనైడ్ విక్రయించిన వ్యక్తుల వాంగ్మూలాలు, కాల్ డేటా మరియు సాంకేతిక ఆధారాలను అతని ముందే ఉంచడంతో తప్పించుకునే మార్గం లేక నేరాన్ని ఒప్పుకున్నాడు. జగదీశ్వరరెడ్డిని చంపేందుకు సాధిక్ మొదట కొబ్బరి నీళ్లలో విషం కలిపి తాగించాడు. తీవ్ర అస్వస్థతతో జగదీశ్వరరెడ్డి కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా, ఆహారం ద్వారా మరో మూడు నాలుగు సార్లు విషం అందించినట్లు అంగీకరించాడు.

కోలుకున్న బాధితుడు.. చివరకు సైనైడ్‌తో అంతం

విషం ప్రభావంతో చనిపోతాడని భావించినప్పటికీ, జగదీశ్వరరెడ్డి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పథకం పారలేదని భావించిన సాధిక్ ఖాన్, ఈసారి ఏకంగా సైనైడ్ రూపంలో విషాన్ని పంపి జగదీశ్వరరెడ్డి ప్రాణాలు తీశాడు. ఈ విచారణలో హత్యకు సంబంధించిన అసలు కారణం బయటపడింది. జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యను పెళ్లి చేసుకుంటే వారి కుటుంబానికి ఉన్న దాదాపు రూ.25 కోట్ల విలువైన ఆస్తులు తన సొంతమవుతాయని సాధిక్ ఆశపడ్డాడు. ఆమె తండ్రి టి.నూకరాజు ఈ వివాహానికి ఏమాత్రం అంగీకరించకపోగా, ఆస్తి మొత్తాన్ని మనవడికి మరియు కుటుంబంలోని మరొకరి పేరున రాస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆవేశానికి గురైన సాధిక్, ఆస్తి దక్కకుండా చేస్తారా అంటూ కుటుంబసభ్యులతో గొడవపడి అందరినీ చంపేస్తానని బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com