మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- September 11, 2026
ముంబై: మహారాష్ట్రలోని భండారా, నాందేడ్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
భండారా జిల్లా ప్రమాదం (9 మంది మృతి)
జాతీయ రహదారి-53 (NH-53)పై మనేగావ్, పింపల్గావ్ మధ్య శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పెట్రోల్ పంప్ నుంచి రోడ్డుపైకి వస్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన పికప్ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది అక్కడికక్కడే మరణించగా, మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.బాధితులు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుండి నాగ్‌పూర్‌కు ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం పికప్ వాహనం డ్రైవర్ పరారయ్యాడు.
నాందేడ్ జిల్లా ప్రమాదం (6 మంది మృతి):
మహారాష్ట్రలో మరోవైపు నాందేడ్ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్-భోకర్ రహదారిపై సీతాఖండి సమీపంలో సాయంత్రం 7 గంటల సమయంలో ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ నాందేడ్ నుంచి భోకర్ వైపు వెళ్తోంది. మార్గమధ్యంలో సీతాఖండి ఘాట్ వద్ద ఎదురుగా వస్తున్న ట్రక్కు వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొనడంతో వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యాన్‌లో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







