2030 విజన్‌ కోసం ఖతార్‌ కీలక అడుగు..!!

- September 11, 2026 , by Maagulf
2030 విజన్‌ కోసం ఖతార్‌ కీలక అడుగు..!!

దోహా: నాలెడ్జ్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో ఖతార్‌ మానవ వనరుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తోంది. థర్డ్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ స్ట్రాటజీ (NDS3), ఖతార్‌ నేషనల్‌ విజన్‌ 2030కు అనుగుణంగా విద్య, నైపుణ్యాలు, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెంచుతోంది. నేషనల్‌ ప్లానింగ్‌ కౌన్సిల్‌ (NPC) ప్రకారం.. దేశ అభివృద్ధికి విద్యనే ప్రధాన పునాదిగా ఖతార్‌ భావిస్తోంది. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో అత్యుత్తమ ప్రతిభతో పాటు పనిచేయాలనే ఆసక్తి, ఉత్పాదకత, సృజనాత్మకతను పెంపొందించేలా చర్యలు చేపడుతోంది.

కరిక్యులమ్‌లో AI, డిజిటల్‌ విద్య

జాతీయ వ్యూహంలో భాగంగా చిన్నారుల ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పాటు K-12 విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తోంది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ లెర్నింగ్‌ టూల్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతలను విద్యా విధానంలో భాగం చేస్తోంది. అదే సమయంలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచేందుకు నిరంతర శిక్షణ, ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌కు పెట్టుబడులు పెడుతోంది. 

ఖతార్‌లోని యూనివర్సిటీలు విద్యార్థులను దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దేలా విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాయి. ప్రారంభ దశ నుంచే పరిశోధనలో పాల్గొనే అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్థులను నేరుగా ఉద్యోగ మార్కెట్‌తో అనుసంధానిస్తున్నారు. విద్యార్థుల్లో స్టార్టప్‌ ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేటర్లు, ప్రారంభ నిధులను అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌కు ముందే తమ వ్యాపార ఆలోచనలను ఆచరణలోకి తీసుకెళ్లే అవకాశం పొందుతున్నారు.

AIలో ప్రత్యేక డిగ్రీ

ఖతార్‌ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ అనుభవం కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘Tamayuz Stimulation Center’, ఫార్మసీ ఫీల్డ్‌ ట్రైనింగ్‌, పరిశోధన-ఆవిష్కరణ కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచుతోంది. అలాగే సామాజిక బాధ్యత, విద్యార్థుల నాయకత్వం, వాలంటీరింగ్‌ను ప్రోత్సహిస్తోంది. జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక సర్వేలు, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక పరిశోధనా కేంద్రాల ద్వారా పరిశోధనను ముందుకు తీసుకెళ్తోంది.

ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు

ఉన్నత విద్యతో పాటు పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఖతార్‌ కొత్త నైపుణ్యాభివృద్ధి మార్గాలను రూపొందిస్తోంది. జీవితాంతం నేర్చుకునే విధానాన్ని (Lifelong Learning) ప్రోత్సహిస్తోంది. జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లు, ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యాలు, స్కాలర్‌షిప్‌ కార్యక్రమాల ద్వారా విద్యా రంగానికి, ఉద్యోగ మార్కెట్‌కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

యువతతో పాటు పెద్దలకు కూడా ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో అవసరమైన డిజిటల్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ అందించడంపై దృష్టి పెట్టింది. డేటా ఆధారిత విధానాలు, ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా టాలెంట్‌ డెవలప్‌మెంట్‌, ఆర్థిక వైవిధ్యీకరణలో ప్రాంతీయ నాయకుడిగా ఖతార్‌ను నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com