పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్‌ శివప్రతాప్‌

- September 11, 2026 , by Maagulf
పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్‌ శివప్రతాప్‌

హైదరాబాద్‌: గణేశ్‌ చతుర్థి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, పర్యావరణహిత మట్టి గణేశ ప్రతిమలను వినియోగించి జల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పిలుపునిచ్చారు. 

పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.

పర్యావరణహిత వేడుకలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లోక్‌భవన్‌ ప్రాంగణంలో లోక్‌భవన్‌ అధికారులు, ఉద్యోగులు మీడియా ప్రతినిధులకు గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి జానకి శుక్లా తో కలిసిపర్యావరణహిత మట్టి గణేశ ప్రతిమలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 14 నుంచి గణేశ ప్రతిమల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పండుగ వేడుకల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పండుగ అనంతరం విగ్రహాల నిమజ్జనం వల్ల జల వనరులు కలుషితం కాకుండా ఉండేందుకు పర్యావరణహిత పదార్థాలతో తయారు చేసిన మట్టి ప్రతిమలను వినియోగించాలని సూచించారు.మట్టి గణేశ ప్రతిమలు సహజసిద్ధంగా నీటిలో కరిగిపోవడంతో జల కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని తెలిపారు.  జల వనరులను కలుషితం చేసే పీవోపీ, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పర్యావరణహిత వేడుకలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. మట్టి గణేశ ప్రతిమల ప్రాధాన్యం, జల సంరక్షణ, కాలుష్య నివారణ సందేశాన్ని మీడియా సంస్థలు, పాత్రికేయులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.

కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి కొమండూరు శశి కిరణాచారి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com