సినిమా రివ్యూ: ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’.!

- September 11, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’.!

బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా తెరకెక్కిన చిత్రమే ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’. ‘#90s మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాని తెరకెక్కించారు. అడల్ట్ సినిమాగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.ప్రమోషన్లు గట్టిగా చేశారు. కాలేజీలకెళ్లి మరీ మా సినిమా చూడండి.. అంటూ ప్రచారం చేశారు. మరి, సినిమాలో స్టఫ్‌కీ, ప్రేక్షకుల ముందుకొచ్చాకా వచ్చిన రెస్పాన్స్‌కీ మధ్య జరిగిన కథా కమామిషు ఏంటీ.? అనేది తెలియాలంటే ముందు ‘ఎపిక్’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
వనపర్తి కుర్రోడు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ). చిన్నతనం నుంచీ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటుంటాడు. కానీ, సినీ రంగంలోని కష్టాలు తెలిసిన తండ్రి (శివాజీ) ఉన్నత చదువులు చదువుకుని కెరీర్‌లో స్థిరపడాలని అంటుంటాడు. ఆ నిమిత్తమే ఇంజినీరింగ్ పూర్తి చేశాకా లండన్ పంపిస్తాడు. ఇష్టం లేకుండానే లండన్ వెళ్తాడు ఆదిత్య. అక్కడ తను జాయిన్ అయిన యూనివర్సిటీలోనే కడలి (వైష్ణవీ చైతన్య) అనే తెలుగమ్మాయితో ఆదిత్యకు పరిచయం ఏర్పడుతుంది. తొలి పరిచయంలోనే ఇద్దరూ బాగా దగ్గరవుతాడు. సహజీవనం వరకూ వెళుతుంది వీరిద్దరి యవ్వారం. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరూ బ్రేకప్ చెప్పుకోవల్సి వస్తుంది. మరి, చివరికి ఈ జంట మళ్లీ కలిసిందా.? వారి వారి కలల్ని నెరవేర్చుకున్నారా.? ఈ 24 ఏళ్ల అబ్బాయి, అమ్మాయి ప్రేమ ప్రయాణం ఎటు వైపు సాగింది.? తెలియాలంటే ‘ఎపిక్’ సినిమా తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
అమాయకత్వం కూడిన పాత్రల్లో ఆనంద్ దేవరకొండను ఆల్రెడీ చూశాం. అదే తరహా పాత్రలో ఈ సినిమాలోనూ కనిపించాడు. జీవించాడు ఆనంద్ దేవరకొండ. అలాగే, బేబీ సినిమాలోని అగ్రెసివ్ తరహా పాత్రలోనే వైష్ణవీ చైతన్య కనిపించింది. తన పాత్రకు న్యాయం చేసింది. ఇంటిమేట్ సీన్లలోనూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. కొన్ని సీన్లు అభ్యంతరకరంగా వున్నప్పటికీ కథ డిమాండ్ చేసిందంటూ డైరెక్టర్ అండ్ కో చెబుతున్నట్లుగా హద్దులు దాటి సన్నివేశాల్ని చిత్రీకరించారు. అఫ్‌కోర్స్.! అందుకే సెన్సార్ సర్టిఫికెట్ అనుకోండి. ఈ సన్నివేశాల సంగతి అటుంచితే, కులాల పట్టింపులకు సంబంధించి కూడా కొన్ని ప్రస్థావనలు ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆదిత్య హాసన్. వాటికీ సెన్సార్ కత్తెర పడడంతో ఎమోషనల్ కనెక్టింగ్ కాస్త తక్కువగా వుంటుంది. నటీనటుల్లో శివాజీ, వాసుకి పాత్రలు నేచురల్‌గా వుంటాయ్. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్, హీరోకి ఊర్లోని స్నేహితుడి పాత్రలో బాగా నటించాడు. ఇతను తెరపై కనిపించిన ప్రతీసారీ నవ్వులు పూస్తాయి. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రల పరిధి మేర బాగానే నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
90s ది మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌లోని లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ ఇంటి నుంచే ఈ కథ కూడా మొదలెట్టాడు దర్శకుడు. ఆ సిరీస‌్‌లోని చిన్న కొడుకు పాత్రకు ఎక్స్‌టెన్షన్‌గా ఈ కథను రాసుకున్నాడు. అయితే జెన్యూనిటీ పేరు చెప్పి అక్కడక్కడా హద్దులు దాటేశాడన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. సినిమా అనేది నా ఇస్టం.. నా ఇష్టమొచ్చినట్లు తీస్తా.. అంటే కుదురుతుందా.? సినిమాల వల్ల యూత్ చెడిపోతారు.. లేదా బాగుపడిపోతారు.. అనేది నిజమా.? కాదా.? అనేది పక్కన పెడితే వాటి వాటి ఇంపాక్ట్ ఖచ్చితంగా సొసైటీ మీద వుంటుందనేది వాస్తవం. ఈ సినిమా యూత్ లవ్ స్టోరీ. ఎపిక్ అంటూ మంచి టైటిల్ పెట్టుకున్నారు. 24 ఏళ్ల వయసులో అబ్బాయి. అదే 24 ఏళ్ల వయసు అమ్మాయి.. ఇద్దరి జీవితాలు ఒకటే కావు. రకరకాల ఒత్తిళ్లూ.. ఇద్దరికీ వుంటాయ్. కెరీర్ కావచ్చు. లైఫ్ కావచ్చు.. కులపరమైన ఒత్తిళ్లు కావచ్చు.. వాటినే ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే, ఆ ప్రయత్నం ఫలించిందా.? వికటించిందా.? అనేది ప్రేక్షకులే తేల్చాలి. సినిమా పరంగా టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది. లండన్ లొకేషన్లను కెమెరాలో అందంగా బంధించిన సినిమాటోగ్రఫీ తీరు బాగుంది. హెషమ్ అబ్డుల్లా మరోసారి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే బీజీఎమ్ కూడా. డైలాగ్స్ బాగున్నాయ్. ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో ఓకే. సెకండాఫ్ మాత్రం చాలా సాగతీతలా వుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయ్..

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్, ఫస్టాఫ్‌లోని స్నేహితుడి కామెడీ, లండన్ లొకేషన్లు, మాటలు..

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్:, ఎలాంటి ట్విస్టులూ, పసలేని పతాక సన్నివేశాలూ, అర్ధాంతరంగా ఆపేసిన క్లైమాక్స్ (సెకండ్ సెమిస్టర్ కోసం అసంపూర్తిగా వదిలేసిన క్లైమాక్స్.. దాంతో కథ అసంపూర్తిగా తోస్తుంది.. ప్రేక్షకుడికి శాటిస్‌ఫేషన్ వుండదు)

చివరిగా:
‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ ప్రేక్షకులే నిర్ణయించాలి ఈ అసంపూర్త పరీక్షా ఫలితం.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com