రాస్ అల్ ఖైమాలో బీచ్ బార్బెక్యూపై నిషేధం..!!

- September 12, 2026 , by Maagulf
రాస్ అల్ ఖైమాలో బీచ్ బార్బెక్యూపై నిషేధం..!!

రాస్ అల్ ఖైమా: యూఏఈలోని రాస్ అల్ ఖైమా ఎమిరేట్‌లో ప్రముఖ ఫ్లామింగో బీచ్‌లో చార్కోల్ కాల్చడం, బార్బెక్యూ చేయడాన్ని అధికారులు నిషేధించారు. ఈ నిషేధం సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. బీచ్ పరిశుభ్రతను కాపాడటంతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. బీచ్‌ను శుభ్రంగా, సురక్షితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఉంచేందుకు ప్రజలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

యూఏఈలో వాతావరణం చల్లబడుతున్న సమయంలో కుటుంబాలు, స్నేహితుల బృందాలు బీచ్‌లకు వెళ్లి బార్బెక్యూ చేసుకోవడం సాధారణం. అయితే బార్బెక్యూ అనంతరం మిగిలిపోయే చార్కోల్, వేడి బొగ్గు కారణంగా పర్యావరణానికి, ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బీచ్‌లో చెప్పులు లేకుండా నడిచే వారికి వేడి బొగ్గు తీవ్ర గాయాలకు కారణమయ్యే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇదే తరహా ఆంక్షలు యూఏఈలోని ఇతర ప్రముఖ ప్రదేశాల్లోనూ అమల్లో ఉన్నాయి. అల్ ఐన్‌లోని జెబెల్ హఫీత్ ప్రాంతంలోని పలు పార్కింగ్ ప్రదేశాల్లో బార్బెక్యూ కార్యకలాపాలు నిషేధించినట్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అబుదాబి చట్టం ప్రకారం నిషేధ సూచనలను ఉల్లంఘిస్తే మొదటి తప్పిదానికి 1,000 దిర్హామ్‌లు, రెండోసారి 2,000 దిర్హామ్‌లు, మూడోసారి 4,000 దిర్హామ్‌ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, రాస్ అల్ ఖైమా పోలీసులు కూడా బీచ్‌లలో భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలను నీటిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని, బీచ్‌లలో విధులు నిర్వహిస్తున్న లైఫ్‌గార్డుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com