సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!

- September 12, 2026 , by Maagulf
సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!

బాగ్దాద్: సౌదీ అరేబియాపై జరిగిన డ్రోన్ దాడులు ఇరాక్‌లో కీలక పరిణామాలకు దారితీశాయి. దాడులకు సంబంధించిన డ్రోన్లు దక్షిణ ఇరాక్‌లోని మైసాన్ ప్రావిన్స్ నుంచి ప్రయోగించినట్లు అధికారులు నిర్ధారించడంతో.. మైసాన్ ఆపరేషన్స్ కమాండ్ కమాండర్‌ను తొలగించాలని ఇరాక్ ప్రధానమంత్రి, సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ అలీ అల్-జైదీ ఆదేశించారు. ఈ ఘటనపై మైసాన్ ఆపరేషన్స్ కమాండ్‌పై ప్రత్యేక దర్యాప్తునకు ప్రధాని ఆదేశించినట్లు ఇరాక్ సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ ప్రతినిధి సబాహ్ అల్-నుమాన్ తెలిపారు.

ఇదిలా ఉండగా సౌదీ అరేబియాపై జరిగిన దాడులను ఇరాక్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సౌదీ భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించే లేదా ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంబంధాలను దెబ్బతీసే ఎలాంటి దాడులను తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. దాడులకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, దాడుల వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థలపై దర్యాప్తు జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అల్-జైదీ ఆదేశించారు.

ఇరాక్ భూభాగాన్ని దాడులకు వేదికగా అనుమతించం

ఇరాక్‌ను లేదా స్నేహపూర్వక, సోదర దేశాలతో ఉన్న సంబంధాలను ప్రమాదంలోకి నెట్టే ఏ కార్యకలాపాన్నీ ప్రభుత్వం సహించబోదని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ఏ దేశంపైనైనా దాడులు చేసేందుకు ఇరాక్ భూభాగాన్ని లేదా గగనతలాన్ని ప్రయోగ వేదికగా ఉపయోగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది.

సౌదీపై ఇరాక్ నుంచి డ్రోన్ దాడులు

ఇరాక్ నుంచి ప్రయోగించినట్లు పేర్కొన్న పలు డ్రోన్లు సౌదీ అరేబియాలోని రియాద్, మదీనా ప్రాంతాల్లో ఉన్న వ్యూహాత్మక ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని సౌదీ అరేబియా తెలిపింది. ఈ దాడుల్లో పలువురు గాయపడగా, పైప్‌లైన్‌కు నష్టం జరిగినట్లు వెల్లడించింది. ఘటన అనంతరం అత్యవసర, ప్రత్యేక సాంకేతిక బృందాలను రంగంలోకి దించి పైప్‌లైన్ భద్రతను పరిశీలించారు. కాగా..దాడులను సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అయితే ప్రస్తుత దశలో ప్రతిదాడి చేయకూడదని సౌదీ నిర్ణయించింది. ఇరాక్ ప్రధాని విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com