‘హ్యాపీ జర్నీ’కి ప్రేక్షకులే హీరోలు: డైరెక్టర్ అభిరామ్ నాయుడు

- September 12, 2026 , by Maagulf
‘హ్యాపీ జర్నీ’కి ప్రేక్షకులే హీరోలు: డైరెక్టర్ అభిరామ్ నాయుడు

గుత్తా ప్రొడక్షన్ & కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ ‘హ్యాపీ జర్నీ’ ఫన్, ఎమోషన్స్‌తో రిఫ్రెషింగ్ ట్రైలర్ లాంచ్

ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా అనిపించే ప్రయాణం.. ‘హ్యాపీ జర్నీ’లో అదే ఆలోచనను ఏడుగురు మహిళల జీవితాలు, అనుభవాల ద్వారా ఆసక్తికరంగా చూపించారు. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు.  గుత్తా ప్రొడక్షన్స్,  కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై  బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న 'హ్యాపీ జర్నీ' చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ట్రైలర్ ఏడుగురు మహిళలు టూరిస్ట్ గైడ్ సహాయంతో యూరప్ ట్రిప్‌కు బయలుదేరడంతో ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో కథ, సమస్య, వ్యక్తిత్వం, జీవితంపై ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కలిసి గడిపే సమయాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్లు జర్నీని ప్రారంభిస్తారు. అయితే విభిన్న వ్యక్తిత్వాల కారణంగా త్వరలోనే వారి మధ్య భేదాభిప్రాయాలు, గొడవలు మొదలవుతాయి. జర్నీ కొనసాగుతున్న కొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టి, చివరకు బలమైన, అందమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు.

విభిన్న వయసులు, విభిన్న నేపథ్యాలకు చెందిన మహిళలు ఒకే జర్నీలో కలుసుకోవడం ఈ కథలో ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తోంది. అందమైన యూరప్ లొకేషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, వ్యక్తిగత అనుభవాలు, పూర్తిగా భిన్నమైన వ్యక్తులు ఒకే ప్రయాణాన్ని పంచుకున్నప్పుడు ఏర్పడే అనుకోని బంధాలను ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. దర్శకుడు అభిరామ్ నాయుడు హ్యూమర్, ఎమోషన్‌ను చక్కగా బ్యాలెన్స్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా తమ పాత్రల్లో విభిన్న వ్యక్తిత్వాలు, ఎమోషన్స్‌ను చూపించారు. కథలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా.. నటీనటులు తమ పాత్రలకు సహజత్వం, ఆకర్షణను తీసుకొచ్చారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందమైన యూరప్ ల్యాండ్‌స్కేప్స్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేస్తూ జర్నీకి విజువల్ రిచ్‌నెస్ తీసుకొచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కథకు చక్కగా సూటయ్యే సంగీతాన్ని అందించారు. హ్యూమర్, ఎమోషనల్ సీన్స్‌ను ఎలివేట్ చేయడంతో పాటు ఆహ్లాదకరమైన ట్రావెల్ వైబ్‌ను తీసుకొచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. ఛోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు.

‘హ్యాపీ జర్నీ’పై ట్రైలర్ ఆసక్తిని పెంచింది. యూనిక్ కాన్సెప్ట్, విభిన్న పాత్రలు, అందమైన యూరప్ బ్యాక్‌డ్రాప్, హ్యూమర్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రిఫ్రెషింగ్ జర్నీని అందించబోతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో  డైరెక్టర్ అభిరామ్ నాయుడు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మన పేరెంట్స్ మీద మనకి చాలా ప్రేమ ఉంటుంది. కాకపోతే దాన్ని చూపించుకునే విధానం చాలా తక్కువ. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో చూపిస్తాం. నిజంగా జనాభా పెరిగితే ఒకరికొకరు తోడు పెరగాలి. కానీ మనం వంటరి అవుతున్నాను. ఫోన్  నెంబర్లు ఉంటాయి కానీ ఎవరికీ ఫోన్ చేయలేని పరిస్థితి.  ఒకరికొకరు తోడుగా ఉంటే ఎంత అందంగా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఇందులో ఏడుగురు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే మహిళల జర్నీని మీరు చూస్తారు. అన్నపూర్ణమ్మ గారు, ఝాన్సీ గారు.. ఇలా అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  మా నిర్మాతలు కథను నమ్మి ఈ సినిమా చేసినందుకు థాంక్యూ. శేఖర్ చంద్ర గారు మీనింగ్‌ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాకి ప్రేక్షకులే హీరోలు. ఎందుకంటే ఇది మన అందరి కథ. సినిమా అంతా చాలా ఫన్ ఉంటుంది. చివర్లో చాలా మంచి పాయింట్ కూడా ఉంటుంది. అది మీ అందరికీ నచ్చుతుంది.

పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ప్రతి సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానం, ప్రేమ ఇచ్చారు. ఈ సినిమాతో నాకు ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఈ సినిమా బ్యూటిఫుల్ జర్నీ. మా నిర్మాతలు మమ్మల్ని ఎంతో కేర్‌తో చూసుకున్నారు. ఇది కేవలం అమ్మాయిల సినిమా కాదు..   ఇది అబ్బాయిలు, ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా. చాలా మంచి ఎమోషన్, హ్యూమర్ ఉంటుంది. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

వంశీ మాట్లాడుతూ.. ఇలాంటి లైట్ మూమెంట్స్, ఎమోషన్ , ఫన్ సినిమాలు చేయడం చాలా కష్టం. కానీ మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. తప్పకుండా మీరందరూ కూడా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను.

పృథ్వీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా మీ అందరికీ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. చాలా మంచి ప్లజెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా చూసిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

రవి శివతేజ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18న ఈ సినిమా వస్తుంది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అది నా ప్రామిస్. మా డైరెక్టర్ ఒక మంచి సినిమా ఇవ్వాలని నిరంతరం కష్టపడ్డారు. కేవలం లేడీస్ గురించి కాదు.. మనందరి కథ. తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది.

సునయన మాట్లాడుతూ.. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. నిర్మాతలు అద్భుతమైన సినిమా చేశారు. ఇందులో ప్రతిదీ ఒరిజినల్‌గా ఉంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది.  చూసిన తర్వాత ప్రతి ఆడియన్స్‌లో ఒక గొప్ప సంతృప్తి ఉంటుంది. సినిమా గొప్ప విజయం సాధించి మా నిర్మాతలకు మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.

జినీషా మాట్లాడుతూ.. ఇందులో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. అన్ని జనరేషన్స్‌కు నచ్చే ఇలాంటి ఒక సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్‌కి, నిర్మాతలకి థాంక్యూ సో మచ్. మూవీ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.  

రూప మాట్లాడుతూ.. ఈ సినిమా బ్యూటిఫుల్ జర్నీ. మా డైరెక్టర్ గారికి థాంక్యూ. నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు.  ప్రొడ్యూసర్స్ ఎంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్నపూర్ణమ్మ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. చాలా యూనిక్ సినిమా. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

తరుణ్ మాట్లాడుతూ.. హ్యాపీ జర్నీ టీమ్ అందరికీ థాంక్యూ.  ఇది చాలా హానెస్ట్ ఫిల్మ్. చాలా కష్టపడి, ఇష్టపడి చేశాను. తప్పకుండా అందరూ సినిమాని థియేటర్‌లో చూస్తారని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్‌లో మాట్లాడదాం.

ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ మాట్లాడుతూ.. ఇది చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండే సినిమా. మనకు మన నిత్య జీవితంలో మనతో పాటు ప్రయాణం చేసే, మనకందరికీ తెలిసిన ఏడు క్యారెక్టర్లు. ఈ సినిమాతో డైరెక్టర్ అభిరామ్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాడు. కచ్చితంగా తన జర్నీ అదిరిపోతుంది. అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇది మన ఇంట్లో ఉండే లేడీస్ కథ. ఇందులో మాన్ ఇంటి మనుషులే కనిపిస్తారు. అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అభిరామ్ నాయుడు
నిర్మాతలు: బాలాజీ గుత్తా & కౌశిక్ రెడ్డి
బ్యానర్లు: గుత్తా ప్రొడక్షన్ & కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్
సహ నిర్మాత: తరుణ్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శైలేంద్ర కుమార్
సంగీతం: శేఖర్ చంద్ర
DOP: మణికందన్ సుబ్రమణియన్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
పబ్లిసిటీ: అనిల్ & భాను
PRO: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com