సుల్తాన్ బోట్స్వానా పర్యటనతో కొత్త పెట్టుబడి అవకాశాలు..!!

- September 16, 2026 , by Maagulf
సుల్తాన్ బోట్స్వానా పర్యటనతో కొత్త పెట్టుబడి అవకాశాలు..!!

గాబొరోన్: ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ బోట్స్వానాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలతో పాటు ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా మారనుందని బోట్స్వానా అధికారులు తెలిపారు. ఈ పర్యటనతో ఇప్పటివరకు పునాది దశలో ఉన్న ఒమన్–బోట్స్వానా సంబంధాలు మరింత విస్తరించి, కొత్త ఆర్థిక, పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం అవుతుందని వారు పేర్కొన్నారు.

కువైట్‌లోని బోట్స్వానా రాయబార కార్యాలయ ఛార్జ్ డి అఫైర్స్, ఒమన్‌తో బోట్స్వానా సంబంధాల పర్యవేక్షకుడు అమాంగ్వే మడిసెక్వానా మాట్లాడుతూ.. సుల్తాన్ హైతమ్ పర్యటన తమ దేశానికి చారిత్రాత్మకమైనదని అన్నారు. గత ఏడాది కాలంలో ఒమన్–బోట్స్వానా సంబంధాలు వేగంగా బలోపేతం అయ్యాయని, దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం, పరస్పర విశ్వాసం మరింత పెరిగాయని తెలిపారు.

బోట్స్వానా ప్రస్తుతం తన ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మైనింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులను పెంచుకోవాలని చూస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమన్, బోట్స్వానా మధ్య పునరుత్పాదక ఇంధన రంగంలో సహకార ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా బోట్స్వానాలోని మౌన్ ప్రాంతంలో భారీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు.

సుల్తాన్ పర్యటనతో ఒమన్‌తో ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించే అవకాశం లభిస్తుందని బోట్స్వానా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమో డొనాల్డ్ న్టాబో తెలిపారు.వ్యవసాయం, ఆర్థిక సేవలు, ఇంధనం, మైనింగ్ వంటి పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. అలాగే ఇరు దేశాల నాయకులు, అధికారుల పరస్పర పర్యటనలు, ప్రాజెక్టుల వేగవంతమైన అమలు ద్వారా బోట్స్వానా ఆర్థిక వైవిధ్యీకరణకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

బోట్స్వానా సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న దేశం. అక్కడ రాగి, వజ్రాలు, బొగ్గు వంటి ఖనిజ వనరులు విస్తారంగా ఉన్నాయి. వీటికి విలువను జోడించే పరిశ్రమలు, తయారీ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు. బోట్స్వానాలోని వివిధ రంగాల్లో ఒమన్ పెట్టుబడులకు ఇది కొత్త అవకాశాలను తెరవనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com