మస్కట్‌లో ఈ-బైక్‌ ల వినియోగానికి ప్రోత్సాహం..!!

- September 19, 2026 , by Maagulf
మస్కట్‌లో ఈ-బైక్‌ ల వినియోగానికి ప్రోత్సాహం..!!

మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. మస్కట్ మునిసిపాలిటీ త్వరలో మునిసిపల్ క్లీనింగ్ కార్యకలాపాల కోసం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల జరిగిన క్లైమేట్ వీక్ 2026లో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రదర్శించారు. వీటి వినియోగం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు మునిసిపల్ సేవల్లో సుస్థిరతను పెంచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం సాధ్యమవుతుందని మునిసిపాలిటీ తెలిపింది.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 140–160 కి.మీ.

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. మొత్తం బ్యాటరీ సామర్థ్యం 5.6 kWhగా ఉంటుంది. బైక్‌లలో IoT సాంకేతికతతో పాటు SIM కార్డు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వాహనాల ట్రాకింగ్, నిర్వహణను సులభంగా పర్యవేక్షించవచ్చు.

14 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు

మస్కట్‌లో మొత్తం 14 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో అల్ ఖురుమ్, అల్ ఘుబ్రా, అల్ ఖౌద్ సూక్ ప్రాంతాల్లో ఛార్జింగ్/బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ప్రారంభించనున్నారు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, స్వాప్ స్టేషన్లలో ఖాళీ బ్యాటరీని తొలగించి ఛార్జ్ చేసిన బ్యాటరీని అమర్చుకునే విధానం ద్వారా ఈ-బైక్‌ల వినియోగాన్ని మరింత సులభతరం చేయనున్నారు.

డెలివరీ రంగానికీ ప్రయోజనం

మస్కట్ గవర్నరేట్‌లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు మస్కట్ మునిసిపాలిటీ, థిమార్ కంపెనీ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ నెట్‌వర్క్ డెలివరీ రంగానికి కూడా సేవలందించడంతో పాటు, మరింత సమర్థవంతమైన, పర్యావరణహిత రవాణా విధానాల వైపు మార్పును ప్రోత్సహించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com