అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ
- November 05, 2026
అమెరికా: అమెరికా రాజకీయంలో భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు తమ ప్రభావాన్ని చాటుతున్నారు. తాజాగా జరిగిన యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో తెలుగు మూలాలున్న డెమోక్రటిక్ నేత అరుణా మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించారు. గవర్నర్ వెస్ మూర్తో కలిసి వరుసగా రెండోసారి ఈ కీలక పదవిని సొంతం చేసుకుని ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఎవరీ అరుణా మిల్లర్?
అరుణా మిల్లర్ 1964 నవంబర్ 6న హైదరాబాద్‌లోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం అమెరికాకు వలస వెళ్ళింది. న్యూయార్క్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె, మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా కాలీఫోర్నియా, వర్జీనియా, హవాయీ రాష్ట్రాల్లో దాదాపు 25 ఏళ్ల పాటు సేవలు అందించారు. రోడ్డు భద్రత, ప్రజా రవాణా వ్యవస్థల ఆధునికీకరణ కోసం కృషి చేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మోంట్గోమరీ కౌంటీకి మారి అక్కడ స్థిరపడ్డారు. 2010లో తొలిసారి మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌కు ఎన్నికై 2018 వరకు ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు.
మొదటి సారి రికార్డు
2022లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపొంది, ఆ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ పదవిని అధిరోహించిన తొలి దక్షిణాసియా మహిళగా నిలిచారు. ఇప్పుడు మరోసారి గెలిచి తమ పట్టును నిరూపించుకున్నారు.
తెలుగు మూలాలు, సంస్కృతి పై మక్కువ
అమెరికాలో దశాబ్దాలుగా స్థిరపడినప్పటికీ తన భారతీయ మూలాలను, తెలుగు భాషను అరుణ మరచిపోలేదు.
“చిన్నతనంలో విజయవాడలో అమ్మమ్మ దగ్గర పెరిగాను. ఇప్పటికీ నేను తెలుగు స్పష్టంగా మాట్లాడగలను. శాకాహారానికే ప్రాధాన్యత ఇస్తాను. సాంబారు, గోంగూర, వంకాయ కూరలు, నిల్వ పచ్చళ్లు ఎంతో ఇష్టంగా తింటాను” అని అరుణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలిసారి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో భగవద్గీతపై చేయి ఉంచి ప్రమాణం చేయడం ద్వారా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల తనకున్న గౌరవాన్ని ఆమె చాటుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నవంబర్ 16 నుంచి వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2026.. 90కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!
- 2030 నాటికి జీసీసీ రైల్వే నెట్వర్క్.. బహ్రెయిన్ సమీక్ష..!!
- ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!
- గ్లోబల్ టెక్ హబ్‌గా దోహా.. రెండోసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026..!!
- యూఏఈ పిల్లల్లో తగ్గుతున్న చేతిరాత నైపుణ్యం..!!
- 122 సాంకేతిక రంగాలకు సౌదీ నాణ్యత పరీక్షల విస్తరణ..!!
- ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు







