త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!

- September 19, 2026 , by Maagulf
త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!

జపాన్‌లోని ఐచి-నగోయాలో 20వ ఆసియా క్రీడలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పాలోమా మిజుహో స్టేడియంలో కన్నులపండువగా జరిగిన ఆరంభ వేడుకల్లో భారత క్రీడా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో భారత బృందానికి పతాకధారులుగా స్టార్ కబడ్డీ ప్లేయర్ పవన్ సెహ్రావత్, ఒలింపిక్ పతక విజేత షార్టర్ మను భాకర్ వ్యవహరించారు. వీరిద్దరూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపించారు.

ఈ మెగా స్పోర్టింగ్ ఈవెంట్‌లో భారత్ తరఫున 36 క్రీడా విభాగాల్లో మొత్తం 503 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. వాస్తవానికి పురుషుల విభాగంలో పతాకధారిగా షాట్‌పుటర్ తాజిందర్‌పాల్ సింగ్ తూర్‌ను ఎంపిక చేశారు. అయితే, అతడికి సంబంధించిన సెరిమోనియల్ కిట్ సకాలంలో అందకపోవడంతో వేడుకకు హాజరు కాలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన భారత కబడ్డీ జట్టులో పవన్ కీలక సభ్యుడిగా ఉన్నాడు.

రికార్డుల వీరులు పవన్, మను భాకర్

మహిళల విభాగంలో పతాకధారిగా వ్యవహరించిన మను భాకర్, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారత చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా రికార్డులకెక్కిన మను భాకర్, ఈ ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో పోటీపడనుంది.

గతంలో చైనాలోని హాంగ్‌జౌ (2022) ఆసియా క్రీడల్లో భారత్ ఏకంగా 107 పతకాలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసారి ఆ చారిత్రాత్మక ప్రదర్శనను అధిగమించి, మరిన్ని ఎక్కువ స్వర్ణాలతో సరికొత్త రికార్డులు నెలకొల్పాలని భారత క్రీడాకారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com