నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్

- September 19, 2026 , by Maagulf
నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్

తెలంగాణ: మారుతున్న వాతావరణ, వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆధునిక, శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.ముఖ్యంగా వరి సాగులో నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని తెలిపారు.

పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్‌లో సో అండ్ రీప్ క్లైమేటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరి వరహాలు’ రైతుల సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నీటి నిర్వహణలో సమర్థవంతమైన పద్ధతులను పాటించిన రైతులను ఈ సందర్భంగా సత్కరించి, ఎకరాకు రూ.500 చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ సాగు ఉత్పాదకతను పెంచే శాస్త్రీయ పద్ధతులను రైతులు అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. పంటకు అవసరమైన మేరకే నీటిని అందించడం ద్వారా అనవసర నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.

పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో నీటి పొదుపు వరి సాగు పద్ధతులను రైతుల్లో ప్రోత్సహిస్తున్న సో అండ్ రీప్ క్లైమేటెక్ సంస్థను కలెక్టర్ అభినందించారు. పూర్వ కరీంనగర్ జిల్లాలో సంస్థ చేపడుతున్న బయోచార్, బయోగ్యాస్, అగ్రోఫారెస్ట్రీ ప్రాజెక్టులకు జిల్లా యంత్రాంగం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆధునిక సాగు పద్ధతులను విజయవంతంగా అమలు చేస్తున్న రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవాలని, తద్వారా సుస్థిర వ్యవసాయ పద్ధతుల విస్తరణకు తోడ్పడాలని కలెక్టర్ సూచించారు.

AWD పద్ధతితో నీటి పొదుపు

జిల్లా వ్యవసాయ అధికారి బి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. భవిష్యత్ వ్యవసాయానికి నీటి సమర్థ వినియోగం అత్యంత కీలకమని అన్నారు. వరి పొలాల్లో నిరంతరం నీరు నిల్వ ఉంచే విధానానికి బదులుగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (AWD) పద్ధతిని రైతులు అవలంబించాలని సూచించారు.

AWD విధానంలో వరి పొలాన్ని కొంతకాలం ఎండనిచ్చి, పంట అవసరానికి అనుగుణంగా తిరిగి నీటిని అందిస్తారు. దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యావరణహిత వ్యవసాయానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.

సో అండ్ రీప్ క్లైమేటెక్ సీవోవో ఎన్. మురళీధర్ మాట్లాడుతూ.. నీటి సంరక్షణతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను కూడా పెంచే విధానాలను రైతులకు పరిచయం చేయడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. శాస్త్రీయ నీటి నిర్వహణ ద్వారా అనవసర నీటి వినియోగాన్ని తగ్గించి వరి సాగు సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు.

సంస్థ డైరెక్టర్ డి. దివ్యారెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కేవలం నీటి పొదుపుకే పరిమితం కాకుండా, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాల్లో రైతులను భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో కొనసాగుతోందన్నారు.

వరి పొలాల్లో నిరంతరం నీరు నిల్వ ఉండటం వల్ల మీథేన్ ఉద్గారాలు పెరిగే అవకాశం ఉంటుందని, AWD పద్ధతిలో పంట అవసరానికి అనుగుణంగా నీటిని అందించడం ద్వారా నీటి వృథాను తగ్గించడంతో పాటు మీథేన్ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. వ్యవసాయ రంగం నుంచి మీథేన్ ఉద్గారాలను తగ్గించడం వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే విస్తృత ప్రయత్నాలకు దోహదపడుతుందని తెలిపారు.

రైతుల్లో నీటి సంరక్షణ, శాస్త్రీయ సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన పెంచేందుకు వ్యవసాయ శాఖతో పాటు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏడీ కంఠయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీనాథ్, డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ పటేల్, హైకోర్టు న్యాయవాది, యువ జనతా ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధార్తి నవీన్, ఎంఏఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సో అండ్ రీప్ క్లైమేటెక్ తరఫున సీవోవో ఎన్. మురళీధర్, డైరెక్టర్ డి. దివ్యారెడ్డి, ఆపరేషన్స్ మేనేజర్ చి.వెంకట రమణ, ఎన్బీఎస్ హెడ్ పృథ్వీరామ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి. స్వప్నతో పాటు సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com