కువైట్‌లో 28,739 మందికి టైప్-1 డయాబెటిస్..!!
- September 21, 2026
కువైట్ : కువైట్‌లో సుమారు 28,739 మంది టైప్-1 డయాబెటిస్తో జీవిస్తున్నట్లు కువైట్ డయాబెటిస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ వలీద్ అల్-దాహి తెలిపారు. డయాబెటిస్ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. డయాబెటిస్ చికిత్సలో తాజా పరిణామాలపై నిర్వహించిన ప్రత్యేక శాస్త్రీయ కార్యక్రమంలో డాక్టర్ అల్-దాహి మాట్లాడారు. ఒమ్మిపాడ్ (Omnipod) 5 స్మార్ట్ ఇన్సులిన్ పంప్ వంటి ఆధునిక పరికరాలు రోగులకు మరింత సౌకర్యవంతంగా, కచ్చితమైన ఇన్సులిన్ అందించడంలో సహాయపడుతున్నాయని తెలిపారు.
ఈ స్మార్ట్ ఇన్సులిన్ పంప్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించి, ఇన్సులిన్ సరఫరాతో అనుసంధానిస్తుంది. రోగి అవసరాలకు అనుగుణంగా ఇన్సులిన్ మోతాదును సర్దుబాటు చేసేందుకు ప్రత్యేక అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందన్నారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా పడిపోవడం (హైపోగ్లైసీమియా), చాలా ఎక్కువగా పెరగడం (హైపర్గ్లైసీమియా) వంటి పరిస్థితులను తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉందని డాక్టర్ అల్-దాహి వివరించారు.
కొన్ని ఆధునిక అంటుకునే ఇన్సులిన్ పంపులను మూడు రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సాధారణంగా రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చే రోగులకు ఇది చికిత్స భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు.
ముఖ్యంగా టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న పిల్లలు, యువతకు ఈ ఆధునిక టెక్నాలజీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చికిత్సకు సంబంధించిన ఇబ్బందులను తగ్గించడంతో పాటు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయని తెలిపారు.
పిల్లలు, కౌమారదశలో ఉన్నవారికి ప్రత్యేకంగా ఆధునిక ఇన్సులిన్ పంప్ సాంకేతికతలను కువైట్ అందిస్తూనే ఉందని డాక్టర్ అల్-దాహి చెప్పారు. అలాగే డయాబెటిస్ చికిత్సలో వస్తున్న తాజా సాంకేతిక పరిణామాలపై వైద్యులు, నిపుణులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!
- డిసెంబర్ 31 నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి..!!
- ‘ఫౌండాయో’కు యూఏఈ ఆమోదం.. ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు..!!
- ముంబై, మస్కట్ ప్రయాణికులపై అదనపు భారం..!
- సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!
- దీపావళి క్రాకర్స్ షాపులకు GHMC కొత్త రూల్స్..
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్







