ఖతార్‌ మెట్రాష్ యాప్‌.. 500కుపైగా సేవలు..!!

- September 21, 2026 , by Maagulf
ఖతార్‌ మెట్రాష్ యాప్‌.. 500కుపైగా సేవలు..!!

దోహా: ఖతార్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అందిస్తున్న మెట్రాష్ (Metrash) యాప్‌ కు 2.8 మిలియన్లకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ యాప్‌ ద్వారా ఆరు భాషల్లో 500కుపైగా సేవలు అందుబాటులో ఉండగా, ఏటా 10 మిలియన్ల కంటే ఎక్కువ సేవా లావాదేవీలు జరుగుతున్నాయి. “ది ఈ-సర్వీసెస్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (MoI) త్రూ మెట్రాష్ యాప్” పేరుతో ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో MoI సిస్టమ్స్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారి కెప్టెన్ అలీ అహ్మద్ సయీద్ ఈ వివరాలను వెల్లడించారు.

2011లో ప్రారంభం

మెట్రాష్ యాప్‌ను 2011లో ప్రారంభించారు. తాజాగా యాప్‌ను కొత్త వెర్షన్‌లో విధానాలను సరళీకరించడంతో పాటు పలు కొత్త సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రజలు ఇల్లు లేదా కార్యాలయం నుంచే ప్రభుత్వ సేవలను పొందడంతో పాటు లావాదేవీలను వేగంగా పూర్తి చేసుకునే అవకాశం కలుగుతోంది. కొత్త డిజైన్‌ స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీకి అనుగుణంగా రూపొందించామని కెప్టెన్ సయీద్ తెలిపారు. వివిధ రకాల మొబైల్‌ పరికరాల్లో యాప్‌ను సులభంగా, సౌకర్యవంతంగా ఉపయోగించుకునేలా మార్పులు చేసినట్లు చెప్పారు.

పలు కీలక సేవలు

మెట్రాష్‌లో వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో:

* ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సేవలు

* కుటుంబ సభ్యులు, స్నేహితుల ఉల్లంఘనల వివరాలు

* సాధారణ ప్రభుత్వ సేవలు

* దరఖాస్తుల స్టేటస్‌ తెలుసుకునే సదుపాయం

* పబ్లిక్ ప్రాసిక్యూషన్ జరిమానాల చెల్లింపు

* సముద్ర సంబంధిత సేవలు

* అత్యవసర SOS సేవ

* కోర్టు తీర్పుల అమలుకు సంబంధించిన సర్టిఫికెట్లు

రెసిడెన్సీ సేవలు కూడా..

మెట్రాష్‌లో రెసిడెన్సీకి సంబంధించిన సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రెసిడెన్సీ పర్మిట్‌ జారీ, రెన్యువల్‌, రద్దు, యజమాని అనుమతులు, కొత్త రెసిడెన్సీ దరఖాస్తులు, రెసిడెన్సీ జరిమానాలు, దరఖాస్తుల స్టేటస్‌ వంటి సేవలను ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవచ్చు. అలాగే యూజర్లు తమ వ్యక్తిగత డిజిటల్‌ ఫైల్‌ను నిర్వహించుకోవచ్చు. ఇందులో పర్సనల్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, సంస్థ వివరాలు, వాహన రిజిస్ట్రేషన్‌, మిలిటరీ లైసెన్స్‌, వివిధ దరఖాస్తులు తదితర సమాచారం ఉంటుంది. పర్మిట్‌ పోయినా లేదా దెబ్బతిన్నా ప్రత్యామ్నాయ పత్రాల కోసం దరఖాస్తు చేయడం, వ్యక్తిగత ఫొటో మార్చడం, పాస్‌పోర్ట్‌ వివరాలను అప్‌డేట్‌ చేయడం, దరఖాస్తులు సమర్పించడం, వాటి పురోగతిని ట్రాక్‌ చేయడం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఫేవరెట్స్‌లో సేవలు సేవ్‌ చేసుకోవచ్చు

మెట్రాష్‌ యాప్‌ నోటిఫికేషన్లను కూడా అందిస్తుంది. తరచుగా ఉపయోగించే సేవలను ఫేవరెట్స్‌ విభాగంలో సేవ్‌ చేసుకోవచ్చు. దీంతో ఇప్పటికే ఉపయోగించిన సేవలు, అవసరమైన డాక్యుమెంట్లను సులభంగా యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఖతార్‌ పౌరులకు ప్రత్యేక సేవలు

ఖతార్‌ పౌరుల కోసం జాతీయ పత్రాలకు సంబంధించిన పలు సేవలు కూడా మెట్రాష్‌లో అందుబాటులో ఉన్నాయి. డాక్యుమెంట్స్ జారీ, రెన్యువల్‌, పోయిన లేదా దెబ్బతిన్న పత్రాల స్థానంలో కొత్తవి పొందడం, రిజిస్ట్రేషన్‌, రద్దు వంటి సేవలను యాప్‌ ద్వారా చేసుకోవచ్చు.

అదేవిధంగా పౌర సేవలకు సంబంధించిన అభ్యర్థనలు సమర్పించడం, ఖతార్‌ జాతీయ డాక్యుమెంట్స్ పోయినట్లు నివేదించడం, ఎలక్ట్రానిక్ ట్రావెల్ పర్మిట్లకు దరఖాస్తు చేయడం వంటి సదుపాయాలు కూడా మెట్రాష్‌లో ఉన్నాయని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com