ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- September 22, 2026
మనామా: ఇరాన్‌కు ఆపాదించిన బహ్రెయిన్‌పై దాడులకు మద్దతుగా, ప్రశంసిస్తూ, సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కేసులో నిందితుడి అప్పీల్‌ను బహ్రెయిన్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ కొట్టివేసింది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ కేసులో నిందితుడికి విధించిన ఐదేళ్ల జైలు శిక్ష, 2,000 బహ్రెయిన్ దినార్ల జరిమానాతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువుల జప్తును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
బహ్రెయిన్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ-కరప్షన్, ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీకి చెందిన సైబర్‌క్రైమ్ డైరెక్టరేట్‌కు ఓ సోషల్ మీడియా ఖాతా గురించి సమాచారం అందింది. ఆ ఖాతాలో బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడులకు మద్దతు ఇచ్చేలా, వాటిని సమర్థించేలా ఫోటోలు, వీడియోలు, వ్యాఖ్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో ఆ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని విచారించడంతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణులను నియమించింది. పరికరాల పరిశీలనలో నిందితుడిపై నమోదైన ఆరోపణలకు సంబంధించిన అంశాలు నిర్ధారణ అయ్యాయని ప్రాసిక్యూషన్ తెలిపింది.
ఐదేళ్ల జైలు శిక్ష
కేసును హై క్రిమినల్ కోర్టుకు అప్పగించగా, పలు దఫాలుగా విచారణ జరిగింది. నిందితుడికి చట్టం కల్పించిన హక్కులు, ముఖ్యంగా తన వాదనను వినిపించుకునే అవకాశం కల్పించిన అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, 2,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధిస్తూ, స్వాధీనం చేసుకున్న వస్తువులను జప్తు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును నిందితుడు అప్పీల్ చేయగా, అప్పీల్ కోర్టు దాన్ని విచారణకు స్వీకరించినప్పటికీ ఆరోపణలపై అభ్యంతరాలను తిరస్కరించి దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో నిందితుడు కోర్ట్ ఆఫ్ కాసేషన్ను ఆశ్రయించాడు. అయితే అత్యున్నత న్యాయస్థానం అప్పీల్‌ను నిబంధనల పరంగా తిరస్కరించడంతో ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా, వస్తువుల జప్తు వంటి శిక్షలు కొనసాగనున్నాయి.
భావ ప్రకటనకు చట్టపరమైన పరిమితులు
భావ వ్యక్తీకరణ, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ చట్ట పరిధిలో హామీ ఇవ్వబడిందని బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఈ హక్కును వినియోగించేటప్పుడు అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ప్రజా భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించే విధంగా సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా చట్టపరమైన పరిమితులు పాటించాల్సి ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







