దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- September 22, 2026
దుబాయ్: మిడిలీస్టులో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగడం సాధ్యం కాదని ప్రముఖ వ్యాపారవేత్త, ఎమార్ ప్రాపర్టీస్, ఈగిల్ హిల్స్ సంస్థల చైర్మన్ మహ్మద్ అల్ అబ్బార్ పేర్కొన్నారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వచ్చే ఏడాది పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల్లో ఈగిల్ హిల్స్ చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం కుదిరిన సందర్భంగా దుబాయ్‌లో ఆయన మాట్లాడారు. ప్రాంతీయ ఘర్షణలు ముగిసిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఆరు నుంచి ఏడు నెలలు పట్టవచ్చని అల్ అబ్బార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగడాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భరించలేదని ఆయన అన్నారు.
మిడిలీస్టు యుద్ధ ప్రభావం భారత్, చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై పడుతోందని పేర్కొన్నారు. ఇంధన ధరలు, ఇతర వ్యయాలు పెరగడం వల్ల ప్రజలపై భారం పెరుగుతోందన్నారు. భారత్‌లో కుటుంబాలు ఆహారం, ఇంధనం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని అల్ అబ్బార్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి దీర్ఘకాలం కొనసాగడం సాధ్యం కాదని అన్నారు. ఇరాన్ కూడా ప్రస్తుత పరిస్థితిలో ఎక్కువ కాలం కొనసాగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాంతాన్ని తిరిగి స్థిరమైన పరిస్థితుల్లోకి తీసుకురావడానికి వివేకంతో కూడిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ముందుకు రావాలని ఆకాంక్షించారు.
కాగా, దుబాయ్‌లోని క్రీక్ హార్బర్‌లో నిర్మించనున్న క్రీక్ టవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు అల్ అబ్బార్ తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య పరిస్థితులు స్థిరపడిన తర్వాత ప్రాజెక్టును టెండర్‌కు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి
భారత్‌లో సుమారు ఆరు కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంలో భారీ వాటర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఈగిల్ హిల్స్ ఆసక్తి చూపుతోందని అల్ అబ్బార్ తెలిపారు. ఈజిప్ట్, సెర్బియా, జార్జియా, దుబాయ్‌లలో చేపట్టిన ప్రాజెక్టుల తరహాలో భారత్‌లోనూ అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ముంబై వంటి నగరాలు సముద్రతీర ప్రాంతాలపై అభివృద్ధి చెందాయని పేర్కొన్న ఆయన, భారత్‌లో ప్రస్తుతం కొన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు. ఈగిల్ హిల్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కంపెనీకి యూఏఈ వెలుపల 29 ప్రాజెక్టులు ఉన్నాయని, కొత్త పెట్టుబడి అవకాశాలను నిరంతరం పరిశీలిస్తున్నామని అల్ అబ్బార్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







