కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!

- September 22, 2026 , by Maagulf
కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!

రియాద్‌ : సౌదీ అరేబియాలో అక్రమంగా ప్రవాస కార్మికులను ఉద్యోగాల్లో నియమించే కంపెనీలు, సంస్థలకు SR100,000 వరకు జరిమానా విధిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కార్మికులకు వారి స్పాన్సర్‌ కాకుండా ఇతరుల కోసం లేదా స్వయంగా పనిచేసేందుకు అనుమతించే యజమానులు, అలాగే ఇతరుల స్పాన్సర్‌షిప్‌లో ఉన్న కార్మికులను ఉద్యోగాల్లో నియమించుకునే సంస్థలపై ఈ చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 ఐదేళ్ల వరకు కొత్త నియామకాలపై నిషేధం

జరిమానాతో పాటు ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. వాటిలో:

* కొత్త కార్మికులను నియమించుకోవడంపై 5 సంవత్సరాల వరకు నిషేధం

* సంస్థ పేరును స్థానిక మీడియాలో సంస్థ ఖర్చుతో ప్రచురించడం

* బాధ్యత వహించే మేనేజర్‌కు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష

* మేనేజర్‌ ప్రవాసి అయితే దేశం నుంచి బహిష్కరణ

ఉల్లంఘనలో పాల్గొన్న కార్మికుల సంఖ్యను బట్టి జరిమానా మొత్తం మరింత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

నిబంధనలు పాటించాలని సూచన

రెసిడెన్సీ, కార్మిక, సరిహద్దు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. అక్రమ కార్మిక నియామకాలు లేదా ఇతర ఉల్లంఘనలు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరింది. మక్కా, మదీనా, రియాద్‌, ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ ప్రాంతాల్లో 911, సౌదీలోని ఇతర ప్రాంతాల్లో 999 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com