కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!

- September 23, 2026 , by Maagulf
కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై  ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!

కువైట్ : వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వేగంగా స్పందించేందుకు కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జనరల్ ఫైర్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ తలాల్ అల్-రౌమీ సపోర్ట్ సెంటర్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాల కారణంగా తలెత్తే ప్రమాదాలు, వరదలు వంటి పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు చేపట్టిన అత్యవసర ప్రణాళికలు, సిబ్బంది, పరికరాల సన్నద్ధతను ఆయన సమీక్షించారు.

పలు పరికరాల పరిశీలన
పర్యటనలో భాగంగా నీటిని తొలగించేందుకు ఉపయోగించే వాటర్ పంపులు, ఎలక్ట్రికల్, మెకానికల్ పంపులతో పాటు మొబైల్ బోట్లను అల్-రౌమీ పరిశీలించారు. ఫైర్ ఇంజిన్లు చేరుకోలేని ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ మొబైల్ బోట్లను వినియోగించనున్నారు.

వేగంగా స్పందించాలి
వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఫీల్డ్ ప్రణాళికలు, వివిధ ప్రాంతాల్లో సిబ్బంది, బృందాల మోహరింపుపైనా అల్-రౌమీ సమీక్షించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంతో పాటు నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు అధిక స్థాయి అప్రమత్తతను కొనసాగించాలని, అత్యవసర ఘటనలకు వేగంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేలా ఫైర్‌ఫోర్స్ బృందాలు, పరికరాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com