ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!

- September 23, 2026 , by Maagulf
ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!

కువైట్: ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు వాహనాల రాకపోకలు సురక్షితంగా, సాఫీగా సాగేందుకు డ్రైవర్లు పలు మార్గదర్శకాలను పాటించాలని కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సూచించింది. “సాఫీగా ట్రాఫిక్‌ ప్రవాహం.. సురక్షిత డ్రైవింగ్‌.. మెరుగైన రాకపోకల దిశగా కలిసి సాగుదాం” అనే నినాదంతో ట్రాఫిక్ అవేర్‌నెస్ డిపార్ట్‌మెంట్ ఈ సూచనలు చేసింది.

డ్రైవర్లు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుని, గమ్యస్థానానికి చేరుకునేందుకు తగిన సమయం ఉండేలా ముందుగానే బయలుదేరాలని ట్రాఫిక్ శాఖ సూచించింది. అలాగే రహదారులపై ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, రద్దీ తక్కువగా ఉన్న మార్గాలను ఎంచుకునేందుకు స్మార్ట్ నావిగేషన్ మ్యాప్స్‌ను ఉపయోగించాలని తెలిపింది.

ట్రాఫిక్ రద్దీని మరింత పెంచే తప్పిదాలకు డ్రైవర్లు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రోడ్డు షోల్డర్‌ను ఉపయోగించడం, ఎగ్జిట్‌ల వద్ద అకస్మాత్తుగా లేన్లు మార్చడం వంటి అనుచిత చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రధాన రహదారి నుంచి వస్తున్న వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పాఠశాలల సమీపంలో వాహనాలను నిలిపేందుకు ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆపాలని ట్రాఫిక్ శాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలు, రహదారిపై అందించే మార్గదర్శకాలను డ్రైవర్లు తప్పనిసరిగా పాటిస్తూ సహకరించాలని కోరింది.

ఈ సూచనలు పాటించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు రహదారులపై సురక్షితమైన, సాఫీమైన వాహన రాకపోకలకు సహకరించవచ్చని ట్రాఫిక్ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com