ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్

- September 23, 2026 , by Maagulf
ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలతో తనకు 13 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. తాను డీసీపీ, సెంట్రల్ జోన్‌గా పనిచేసిన సమయంలో గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు గుర్తుచేశారు.

సెప్టెంబర్ 25న తుది నిమజ్జనం

ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 25 మధ్యాహ్నం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని డీజీపీ తెలిపారు. హైదరాబాద్ సిటీతో పాటు CURE పరిధిలోని ఇతర కమిషనరేట్లలో దాదాపు లక్ష గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని చెప్పారు.

నిమజ్జనం సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం సుమారు 20 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయని డీజీపీ తెలిపారు. వివిధ జలాశయాలు, చెరువుల్లో నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాలతో పాటు బేబీ పాండ్స్ వద్ద కూడా క్రేన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, ఇతర ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. గత 10 రోజులుగా తెలంగాణ పోలీసులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, సెప్టెంబర్ 25న జరిగే తుది నిమజ్జనానికి యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని డీజీపీ పేర్కొన్నారు.

డీజేలు, బాణసంచా తగ్గించాలి

డీజేలు, బాణసంచా వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గించేందుకు ముందుకు వచ్చిన గణేష్ ఉత్సవ కమిటీలు, ప్రజలను డీజీపీ అభినందించారు. అధిక శబ్దంతో కూడిన డీజేలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా ఊరేగింపుల్లో పాల్గొనే భక్తులు, చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు కలిగిస్తాయని తెలిపారు.

పోలీసులకు సహకరించాలి

గణేష్ నిమజ్జనానికి వెళ్లే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించాలని, పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు పూర్తిగా సహకరించాలని డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

గణేష్ నిమజ్జనం ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటని ఆయన అన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన సూచనలు, మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు డయల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com