యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- September 26, 2026
మనామా: జంతువులపై క్రూరత్వానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బహ్రెయిన్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ డిమాండ్ చేసింది. తీవ్రమైన హింస, క్రూరత్వం, ఉద్దేశపూర్వకంగా జంతువులను చంపే ఘటనల్లో BD100,000 వరకు జరిమానా, ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను కఠినతరం చేయాలని సొసైటీ ఛైర్మన్ మహ్మూద్ ఫరాజ్ పార్లమెంట్‌ను కోరారు. జంతువులపై హింస, నిర్లక్ష్యం, సరిగా సంరక్షించకపోవడం వంటి ఘటనలకు సంబంధించి తమ సొసైటీకి ఇప్పటికే 1,000కు పైగా ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఉన్న శిక్షలు ఇవే
ప్రస్తుతం బహ్రెయిన్‌లో అమల్లో ఉన్న Law No. 52 of 2014 ప్రకారం జంతు సంక్షేమానికి సంబంధించిన కొన్ని నేరాలకు గరిష్ఠంగా ఒక నెల జైలు శిక్ష లేదా BD1,000 వరకు జరిమానా లేదా రెండింటిలో ఏదో ఒకటి విధించే అవకాశం ఉంది.
అదేవిధంగా, బహ్రెయిన్ పెనల్ కోడ్ ప్రకారం పెంపుడు లేదా గృహ జంతువులను హింసించడం, అతిగా శ్రమ పెట్టడం, దుర్వినియోగం చేయడం లేదా వాటికి అవసరమైన సంరక్షణ అందించకపోవడం వంటి చర్యలకు మూడు నెలల వరకు జైలు లేదా BD20 వరకు జరిమానా ఉండొచ్చు.
ఉద్దేశపూర్వకంగా పెంపుడు జంతువును చంపడం, విషప్రయోగం చేయడం లేదా తీవ్రమైన గాయాలు కలిగించడం వంటి చర్యలకు ఒక సంవత్సరం వరకు జైలు లేదా BD100 వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.
1,000కు పైగా కేసులు
తమకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఘటనలు అత్యంత క్రూరంగా ఉన్నాయని మహ్మూద్ ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న శిక్షలు నేరాల తీవ్రతకు తగినట్లుగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. జంతువులపై క్రూరత్వానికి పాల్పడితే తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఉండవని కొందరు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జరిమానాలు, జైలు శిక్షలను పెంచడం ద్వారా ఇలాంటి ఘటనలను అరికట్టడంతో పాటు, పదేపదే నేరాలకు పాల్పడేవారిని నిరోధించవచ్చని తెలిపారు. సొసైటీకి అందిన ఫిర్యాదుల్లో విచ్చలవిడి జంతువులను హింసించడం, చంపడం, కుక్కలు, కోళ్ల పోటీలు, వాటికి సంబంధించిన బెట్టింగ్‌లు వంటి ఘటనలు ఉన్నాయని వెల్లడించారు.
అలాగే ఒక పెంపుడు పిల్లిని కాల్చిన ఘటన, ఒక గుర్రపు పిల్లను చంపిన ఘటన, కర్జక్కాన్లోని ఓ ఫారంలో పలు గుర్రాలను హింసించిన ఘటనలు కూడా ఫిర్యాదుల్లో ఉన్నాయని తెలిపారు. గాడిదలు, పిల్లులు, కుక్కలను సరిగా చూసుకోకపోవడం, వాటిపై హింసకు పాల్పడటం వంటి ఫిర్యాదులు కూడా సొసైటీకి అందినట్లు పేర్కొన్నారు.
జంతు సంక్షేమ చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి పార్లమెంట్‌కు తమ అభిప్రాయాలను, అనుభవాలను అందించేందుకు సొసైటీ సిద్ధంగా ఉందని మహ్మూద్ ఫరాజ్ తెలిపారు. అనుమానాస్పద జంతు హింస ఘటనలను సొసైటీ నమోదు చేసి, ఆధారాలను సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాలు ఉన్న సంస్థలకు ఫిర్యాదులను పంపుతున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







