ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి

- September 26, 2026 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి

రూ.1.55 కోట్ల కేంద్ర సహాయంతో 24 కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా 840 మంది కళాకారులకు ప్రయోజనం

విజయవాడ: శ్రీకాళహస్తి కలంకారీ, బొబ్బిలి వీణ, దుర్గి రాతి శిల్పం, కొబ్బరి చిప్పలు, తాటాకు, వెదురు తదితర సంప్రదాయ హస్తకళలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ విస్తృత కార్యక్రమాలను చేపడుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ, డిజైన్ అభివృద్ధి, ఆధునిక పనిముట్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనుంది.

లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ కళల్లో నైపుణ్యం కలిగిన కళాకారులకు ఆధునిక డిజైన్లు, సాంకేతికత, మెరుగైన పనిముట్లపై శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెట్ అవకాశాలను పెంచడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన డెవలప్‌మెంట్ కమిషనర్ (హ్యాండీక్రాఫ్ట్స్) 24 కార్యక్రమాలకు సుమారు రూ.1.55 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 840 మంది కళాకారులకు ప్రయోజనం కలగనుంది.

అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో గురు శిష్య హస్తశిల్ప్ శిక్షణ కార్యక్రమం (GSHPP), డిజైన్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ వర్క్‌షాపులు (DDW), మెరుగైన పనిముట్ల పంపిణీ కార్యక్రమం (ITDP) ఉన్నాయి. వీటితో పాటు విజయవాడలో 10 రోజుల గాంధీ శిల్ప బజార్‌ను నిర్వహించనున్నారు.

గురు శిష్య శిక్షణ కార్యక్రమంలో కొబ్బరి చిప్పలతో కళాకృతుల తయారీ, చెక్క బ్లాక్‌ల తయారీ, శ్రీకాళహస్తి కలంకారీ, తాటాకు కళ, కలంకారీ బ్లాక్ ప్రింటింగ్, దుర్గి రాతి శిల్పం, అగరబత్తుల తయారీ వంటి సంప్రదాయ కళల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో కార్యక్రమంలో 30 మంది కళాకారులు పాల్గొంటారు. రాజమహేంద్రవరం, విజయవాడ, విష్ణువాసం, కాకినాడ, గుంటూరులోని లేపాక్షి కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

డిజైన్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ వర్క్‌షాపుల ద్వారా సంప్రదాయ కళలను ఆధునిక డిజైన్లు, సాంకేతికతతో అనుసంధానం చేయనున్నారు. క్రోషే లేస్, టెర్రకోట బొమ్మలు, బొబ్బిలి వీణ, చెక్క శిల్పాలు, ఇమిటేషన్ జువెలరీ, కేన్ అండ్ బాంబూ, అల్లగడ్డ రాతి శిల్పం, సవర గిరిజన చిత్రకళ, కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ వంటి కళల్లో వర్క్‌షాపులు నిర్వహించనున్నారు.

కళాకారులకు అవసరమైన పనిముట్లను ఆధునీకరించడంపైనా దృష్టి సారించారు. మెరుగైన పనిముట్ల పంపిణీ కార్యక్రమం కింద అరటి పీచు, దుర్గి రాతి శిల్పం, కేన్ అండ్ బాంబూ, చెక్క పనులు, లక్కపని చేసే 200 మంది కళాకారులకు ఆధునిక టూల్‌కిట్లను అందించనున్నారు. డిసెంబర్‌లో అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మార్కెట్ అవకాశాలను పెంచే చర్యల్లో భాగంగా విజయవాడలో అక్టోబర్ 9 నుంచి 18 వరకు గాంధీ శిల్ప బజార్ నిర్వహించనున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ సంప్రదాయ హస్తకళలకు చెందిన 70 మంది కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం రూ.19.48 లక్షలు మంజూరయ్యాయి.

సంప్రదాయ హస్తకళలను ఆధునిక మార్కెట్లకు అనుసంధానం చేయడం ద్వారా కళాకారుల నైపుణ్యం, ఉత్పాదకత, ఆదాయాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.

“రాష్ట్రంలోని గొప్ప హస్తకళల వారసత్వాన్ని కాపాడటంతో పాటు వాటిని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లేపాక్షి లక్ష్యం. సంప్రదాయ నైపుణ్యాలను తరువాతి తరాలకు అందించడంతో పాటు కళాకారులకు మెరుగైన పనిముట్లు, ఆధునిక డిజైన్లు, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తున్నాం” అని లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com