బహ్రెయిన్‌లో ప్రవాస ఉద్యోగులకు కొత్త వెసులుబాటు..!!
- September 29, 2026
మనామా: బహ్రెయిన్‌లో ప్రవాస ఉద్యోగులకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉన్న విదేశీ ఉద్యోగులు, పర్మిట్‌ను బదిలీ చేయకుండానే మరో యజమాని వద్ద గరిష్ఠంగా మూడు నెలల వరకు పని చేసే అవకాశం లభించింది. 2026లో జారీ చేసిన డెసిషన్ నంబర్ 2 ద్వారా ఈ మార్పులు తీసుకొచ్చారు. దేశీయ కార్మికులు (Domestic Workers) మినహా ఇతర విదేశీ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
2008 నాటి నిబంధనల ప్రకారం విదేశీ ఉద్యోగి తన వర్క్ పర్మిట్‌లో పేర్కొన్న యజమాని వద్దే పని చేయాల్సి ఉండేది. అదే కార్యకలాపాలు నిర్వహించే బ్రాంచ్‌లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉండేది. తాజా నిర్ణయంతో ఈ నిబంధనల్లో మార్పులు చేశారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) అనుమతితో ఉద్యోగి మరో యజమాని వద్ద మూడు నెలల వరకు పని చేయవచ్చు.
అయితే ఇందుకు..
- ఉద్యోగి నుంచి లిఖితపూర్వక సమ్మతి ఉండాలి.
- ప్రస్తుత, రెండో యజమాని ఇద్దరూ అంగీకరించాలి.
- LMRA ఈ మార్పును ఆమోదించి నమోదు చేయాలి.
- రెండో సంస్థలోని బహ్రెనైజేషన్ రేటు సాధారణంగా ఉద్యోగి ప్రస్తుతం నమోదైన సంస్థ రేటుతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.
- రెండో సంస్థ రేటు తక్కువగా ఉంటే, LMRA నిబంధనల ప్రకారం అవసరమైన ఫీజును చెల్లించాలి.
ఈ మూడు నెలల కాలంలో ఉద్యోగికి సంబంధించిన హక్కులు, బాధ్యతలకు రెండు సంస్థలు సంయుక్తంగా బాధ్యత వహించాలి.
విదేశాల నుంచి కొత్తగా ఉద్యోగులను తీసుకురావడానికి కాదు
ఈ పథకం ఇప్పటికే బహ్రెయిన్‌లో ఉండి చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ కలిగి ఉన్న విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. విదేశాల నుంచి కొత్త ఉద్యోగులను తీసుకొచ్చి ఈ నిబంధన కింద పనిచేయించడం సాధ్యం కాదు. అలాగే బహ్రెనైజేషన్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
ఒకే యజమాని సంస్థల మధ్య కూడా బదిలీ
ఒకే యజమానికి చెందిన వేర్వేరు కంపెనీలు లేదా ఒకే గ్రూప్‌లోని సంస్థల మధ్య కూడా ఉద్యోగులను తాత్కాలికంగా మార్చుకునే అవకాశం కల్పించారు. ఆయా సంస్థలకు వేర్వేరు కమర్షియల్ రిజిస్ట్రేషన్ (CR) నంబర్లు ఉన్నా ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
అయితే ఉద్యోగి తన వర్క్ పర్మిట్‌లో అనుమతించిన ఉద్యోగ విధుల్లోనే పనిచేయాలని LMRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిబ్రాస్ తాలిబ్ తెలిపారు. మూడు నెలల పరిమితి వల్ల సంస్థలు తాత్కాలిక సిబ్బంది అవసరాలను చట్టబద్ధంగా తీర్చుకోగలవని తెలిపారు. తాత్కాలిక ఏర్పాట్లు నియంత్రణలేని పనిగా మారకుండా ఈ పరిమితి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎంపీ అహ్మద్ అల్ సల్లూమ్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఒకే యజమానికి చెందిన సంస్థల్లో సిబ్బంది అవసరాలను పరస్పరం సర్దుబాటు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
ఉద్యోగం చేసే ప్రదేశంపైనా వెసులుబాటు
కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి తప్పనిసరిగా వర్క్ పర్మిట్‌లో పేర్కొన్న కార్యాలయంలోనే పనిచేయాల్సిన అవసరం ఉండదు. యజమాని ఎంపిక చేసే వర్క్‌ప్లేస్‌లో, పర్మిట్‌లో అనుమతించిన ఉద్యోగాన్ని నిర్వహించవచ్చు.మూడు నెలల తాత్కాలిక నియామకాన్ని LMRA నమోదు చేసి, అది నమోదైన తర్వాత ఉద్యోగికి, సంబంధిత రెండు సంస్థల యజమానులకు సమాచారం అందిస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!
- తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ సేవలకు కొత్త టెండర్.. ఆపరేటర్ మారే అవకాశం..!!
- ఖతార్‌లో ఆన్లైన్ బ్లాక్‌మెయిల్‌పై కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస ఉద్యోగులకు కొత్త వెసులుబాటు..!!
- యాస్మిన్ పాస్ వద్ద మూడు ట్రక్కులు ఢీ..!!
- దుబాయ్‌లో 22 మంది బెగ్గర్స్ ముఠా అరెస్ట్..!!
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’







