యూఏఈలో భారత పాస్‌పోర్ట్ సేవలకు కొత్త టెండర్.. ఆపరేటర్ మారే అవకాశం..!!

- September 29, 2026 , by Maagulf
యూఏఈలో భారత పాస్‌పోర్ట్ సేవలకు కొత్త టెండర్.. ఆపరేటర్ మారే అవకాశం..!!

దుబాయ్: యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలను ఔట్‌సోర్స్ చేసేందుకు భారత రాయబార కార్యాలయం కొత్త టెండర్‌ను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజా టెండర్ ప్రక్రియను చేపట్టారు. సెప్టెంబర్ 28న జారీ చేసిన RFP నంబర్ Abu/Cons/415/08/2026 ద్వారా యూఏఈవ్యాప్తంగా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల (ICACs) నిర్వహణకు సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించారు.

ప్రస్తుతానికి Alhind సేవలు కొనసాగింపు
ప్రస్తుతం Alhind టూర్స్ అండ్ ట్రావెల్స్ యూఏఈలో 16 ICACలను నిర్వహిస్తోంది. జూలై 22నుంచి పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవలను సంస్థ అందిస్తోంది. ప్రస్తుతం ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి Dh19 సర్వీస్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇందులో ఫారం నింపడంలో సహాయం, ఫొటోలు, ఫొటోకాపీలు, కొరియర్ సేవలు ఉన్నాయి.

కోర్టు వివాదం తర్వాత కొత్త టెండర్
మొదటి టెండర్‌లో సాంకేతిక మూల్యాంకన ప్రక్రియను ఇద్దరు విఫల బిడ్డర్లు సవాలు చేయడంతో న్యాయ వివాదం మొదలైంది. జూలైలో ఢిల్లీ హైకోర్టు తాజా టెండర్ ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మూడు నెలల్లో కొత్త టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే అప్పటివరకు భారతీయ ప్రవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు Alhind సేవలను తాత్కాలికంగా కొనసాగించేందుకు అనుమతించింది.

15 ICACల కోసం బిడ్లు
తాజా టెండర్‌లో యూఏఈలోని 15 ICACల నిర్వహణకు బిడ్లను కోరుతున్నారు. అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఫుజైరా, ఉమ్ అల్ కువైన్, ఖోర్ ఫక్కాన్, కల్బా, రాస్ అల్ ఖైమా ప్రాంతాల్లో కేంద్రాలు ఉండనున్నాయి. కాంట్రాక్ట్ కాలపరిమితి మూడేళ్లు. ఒప్పందం కుదిరిన 45 రోజుల్లో సేవలను ప్రారంభించాల్సి ఉంటుంది. విజేతను సాంకేతిక, ఆర్థిక బిడ్లతో కూడిన రెండు దశల ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు.  

 ప్రవాసులకు ప్రస్తుతానికి సేవల్లో అంతరాయం లేదు
యూఏఈలో 4 మిలియన్లకు పైగా భారతీయ ప్రవాసులు ఉన్నారు. తాజా టెండర్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం పాస్‌పోర్ట్ తదితర సేవల్లో అంతరాయం ఉండదని తెలుస్తోంది. అయితే కొత్త టెండర్‌లో మరో సంస్థకు కాంట్రాక్ట్ దక్కితే సేవల ఆపరేటర్ మారే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com