డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!

- September 30, 2026 , by Maagulf
డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!

దుబాయ్: డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన అభ్యర్థులు ఇకపై తాము ఎక్కడ తప్పు చేశారో, ఎందుకు ఫెయిల్ అయ్యారో సులభంగా తెలుసుకునే అవకాశం రానుంది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఆధునీకరించిన స్మార్ట్ టెస్ట్ సిస్టమ్ ‌ను ప్రవేశపెట్టింది. కొత్త తరం స్మార్ట్ టెస్ట్ సిస్టమ్ ద్వారా అభ్యర్థులు పరీక్ష సమయంలో వాహనం ప్రయాణించిన మార్గాన్ని తిరిగి చూసుకోవచ్చు. ఇంటరాక్టివ్ 3D మ్యాప్‌లో టెస్ట్ రూట్‌ను చూపించడంతో పాటు, అభ్యర్థి చేసిన మేజర్, మైనర్ తప్పులను కూడా గుర్తిస్తుంది.

ఈ విధానం ప్రధానంగా లైట్ వెహికల్ యార్డ్ టెస్టుల కోసం ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కంప్యూటర్ విజన్, డేటా అనాలిసిస్ సాంకేతికతలను ఉపయోగించి డ్రైవింగ్ మానెవర్లను రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తుంది. నిర్ణీత ప్రమాణాల ఆధారంగా ఫలితాలను లెక్కిస్తుంది. ఫలితాల లెక్కింపులో మానవ జోక్యం ఉండదు.

బ్లైండ్ స్పాట్లపైనా నిఘా

స్మార్ట్ కెమెరాలు అభ్యర్థి డ్రైవింగ్ సమయంలో మిర్రర్లను పరిశీలిస్తున్నారా, బ్లైండ్ స్పాట్లను చెక్ చేస్తున్నారా, మానెవర్లు చేసేటప్పుడు స్టీరింగ్‌పై చేతులను సరైన విధంగా ఉంచుతున్నారా అనే అంశాలను పర్యవేక్షిస్తాయి. అభ్యర్థి గుర్తింపును నిర్ధారించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో టెస్ట్ ఫలితం సరైన వ్యక్తికి అనుసంధానమవుతుంది.

వాహనం కదలికలను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక పొజిషనింగ్ టెక్నాలజీని సిస్టమ్‌లో చేర్చారు. రియల్-టైమ్ కినెమాటిక్ (RTK) పొజిషనింగ్ ద్వారా వాహనం స్థానం సుమారు రెండు సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు. దీంతో వాహనం నిర్ణీత మార్గం నుంచి తప్పిందా, పార్కింగ్ సమయంలో పొజిషన్‌లో ఏదైనా పొరపాటు జరిగిందా వంటి అంశాలను సిస్టమ్ గుర్తిస్తుంది.

‘పాస్ లేదా ఫెయిల్’కే పరిమితం కాదు

కొత్త విధానం అభ్యర్థికి కేవలం పాస్ లేదా ఫెయిల్ ఫలితాన్ని మాత్రమే ఇవ్వదు. పరీక్షలో ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పును ఎందుకు నమోదు చేశారో కూడా తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. దీంతో తదుపరి టెస్ట్‌కు ముందు ఏ డ్రైవింగ్ నైపుణ్యాలపై ఎక్కువగా సాధన చేయాలో అభ్యర్థికి స్పష్టత వస్తుంది.

ప్రమాదాలను ముందుగానే గుర్తించే బ్రేకింగ్ సిస్టమ్

టెస్ట్ ఏరియాలో ప్రమాదాలను నివారించేందుకు సిస్టమ్‌లో ఆటోమేటిక్ బ్రేకింగ్ ఫీచర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఢీకొనే ప్రమాదం ఉందని గుర్తిస్తే.. వాహనం, అభ్యర్థి లేదా పరిసర ప్రాంతానికి ప్రమాదం జరగకుండా సిస్టమ్ జోక్యం చేసుకుని వాహనాన్ని ఆపగలదు. AI ఆధారిత కొలిషన్ అవాయిడెన్స్, ప్రివెంటివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఫీచర్లు పరీక్షా ప్రాంతంలో భద్రతను మరింత పెంచుతాయని RTA తెలిపింది.

వాతావరణంతో సంబంధం లేకుండా పరీక్ష

పగలు, రాత్రి వేళల్లోనూ, వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ సిస్టమ్ స్థిరంగా పనిచేసేలా రూపొందించారు. దీంతో వాతావరణం, వెలుతురు వంటి బాహ్య పరిస్థితుల ప్రభావం పరీక్ష ఫలితాలపై తగ్గుతుంది. అంతేకాకుండా టెస్ట్ ఫలితాలను డ్రైవింగ్ ట్రైనింగ్ సిస్టమ్‌తో అనుసంధానించవచ్చు. అభ్యర్థి పనితీరు డేటా ఆధారంగా అతనికి ఏ అంశాల్లో మరింత శిక్షణ అవసరమో గుర్తించి, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించే అవకాశం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com