ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!

- September 30, 2026 , by Maagulf
ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!

దోహా: ఖతార్, భారత్ మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఖతార్ బిజినెస్‌మెన్ అసోసియేషన్ (QBA), భారత ఆర్థిక, కార్పొొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై చర్చించింది. ఇరు దేశాల ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని పెంచడంతో పాటు కొత్త పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. భారత్‌లో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న రంగాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడం, పెట్టుబడులను పెంచడం వంటి అంశాలను ఇరు పక్షాలు పరిశీలించాయి. ఖతార్, భారత కంపెనీలు భాగస్వామ్యాలు, ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపైనా చర్చ జరిగింది.

భారత్ భారీ ఆర్థిక వ్యవస్థతో పాటు విస్తృత పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలు కలిగిన వ్యూహాత్మక మార్కెట్ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అదే సమయంలో ఖతార్ ఆధునిక పెట్టుబడి వాతావరణం, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, ప్రపంచస్థాయి మౌలిక వసతులతో భారత కంపెనీలకు గల్ఫ్, ఇతర ప్రాంతీయ మార్కెట్లకు చేరుకునే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. QBA బోర్డు సభ్యుడు షేక్ నవాఫ్ నాసర్ బిన్ ఖలీద్ అల్-థానీ మాట్లాడుతూ.. ఖతార్–భారత్ సంబంధాలు వేగంగా బలోపేతం అవుతున్నాయని అన్నారు. బలమైన వ్యూహాత్మక సంబంధాలు, పరస్పర ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు ఇరు దేశాల సంబంధాలకు పునాదిగా ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇరు దేశాల ప్రైవేట్ రంగాలు మరింత చురుకైన పాత్ర పోషించి దీర్ఘకాలిక పెట్టుబడులు, ఉమ్మడి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సంప్రదాయ వాణిజ్య సంబంధాలను దాటి.. ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతికత-జ్ఞాన బదిలీ, రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు అదనపు విలువ సృష్టించే పెట్టుబడి భాగస్వామ్యాల దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కీలక రంగాలపై దృష్టి
ఇరు దేశాల కంపెనీల మధ్య భవిష్యత్ సహకారానికి పలు రంగాలను సమావేశంలో గుర్తించారు. వాటిలో టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ, కృత్రిమ మేధస్సు (AI), అధునాతన పరిశ్రమలు, ఆర్థిక సేవలు, ఫిన్‌టెక్, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్, రవాణా, లాజిస్టిక్స్, ఆహార భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, మౌలిక వసతులు, పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలు ఉన్నాయి.  రవాణా, లాజిస్టిక్స్, సరఫరా గొలుసుల రంగాల్లో సహకారాన్ని పెంచడం ద్వారా ఖతార్ వ్యూహాత్మక భౌగోళిక స్థానం, ఆధునిక మౌలిక వసతులను భారత్ పారిశ్రామిక, వాణిజ్య సామర్థ్యాలతో అనుసంధానించవచ్చని ఇరు పక్షాలు పేర్కొన్నాయి. దీనివల్ల గల్ఫ్ మార్కెట్లను భారత, ఆసియా మార్కెట్లతో అనుసంధానించే వాణిజ్య అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.

భారత్‌తో వ్యాపార సంబంధాలను మరింత విస్తరించేందుకు, ఇరు దేశాల కంపెనీల మధ్య ప్రత్యక్ష భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు QBA కట్టుబడి ఉందని సమావేశం సందర్భంగా స్పష్టం చేసింది. ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు, వాణిజ్యం, ఉమ్మడి ప్రాజెక్టులను పెంచడం ద్వారా ఖతార్, భారత్‌కు పరస్పర ఆర్థిక ప్రయోజనాలు చేకూరేలా కృషి చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com