బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?

- September 30, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?

మనామా: బహ్రెయిన్‌లో ప్రతిరోజూ 400 టన్నులకు పైగా ఆహారం చెత్తగా మారుతోంది. రమదాన్ సమయంలో ఈ పరిమాణం 600 టన్నులను దాటుతోంది. బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ గణాంకాల ప్రకారం ఆహార వ్యర్థాల సమస్య దేశంలో తీవ్రంగా ఉంది. ఇళ్ల నుంచి వెలువడే ఆహార వ్యర్థాలు కూడా భారీగానే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ప్రకారం.. బహ్రెయిన్‌లో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 132 కిలోల ఆహార వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. అరబ్ దేశాల్లో ఇది అత్యధిక స్థాయిగా నమోదైంది.

దేశవ్యాప్తంగా ఏడాదికి సుమారు 146,000 టన్నుల ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. వీటి విలువ సుమారు 95 మిలియన్ బహ్రెయిన్ దినార్లు ఉంటుందని అంచనా. అస్కర్ ల్యాండ్‌ఫిల్‌కు చేరే మొత్తం వ్యర్థాల్లో దాదాపు సగం ఆహారమే కావడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

ఆహారాన్ని చెత్తబుట్టకు చేరకుండా..
తినడానికి అనువైన మిగులు ఆహారాన్ని రక్షించే కార్యక్రమాల్లో కన్సర్వింగ్ బౌంటీస్ సొసైటీ కీలక పాత్ర పోషిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ సంస్థ బహ్రెయిన్ ఫుడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, వివాహ వేడుకలు, కార్పొరేట్ కార్యక్రమాల నుంచి మిగిలిపోయిన, ఉపయోగించని ఆహారాన్ని సేకరించి.. దాన్ని ప్యాక్ చేసి అవసరమైన కుటుంబాలు, తక్కువ ఆదాయం కలిగిన కార్మికులకు పంపిణీ చేస్తోంది. గత ఏడాది ఈ సంస్థ 230 టన్నుల ఆహారాన్ని రక్షించింది. ప్రస్తుతం 66 హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, కేఫ్‌లతో కలిసి సంస్థ పనిచేస్తోంది.

ఎరువుల తయారీకి..
ఆహార వ్యర్థాలను తగ్గించే ప్రయత్నాల్లో ముహర్రక్ మున్సిపాలిటీ కూడా భాగస్వామ్యమైంది. వ్యాపార సంస్థలు ఉపయోగించదగిన మిగులు ఆహారాన్ని విరాళంగా ఇచ్చేలా ప్రోత్సహించేందుకు ఫుడ్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పునర్వినియోగానికి అనువుగా లేని ఆహార వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రణాళికలపైనా దృష్టి సారిస్తోంది. మరోవైపు కొన్ని యాప్‌లు కూడా ఆహార వృథాను తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. రెస్టారెంట్లు, కేఫ్‌లు, బేకరీల్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఆహారాన్ని వినియోగదారులు 70 శాతం వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం ఈ యాప్‌ల ద్వారా లభిస్తోంది.

ఇళ్ల నుంచే మార్పు..
ఆహారాన్ని రక్షించే కార్యక్రమాలు విస్తరిస్తున్నప్పటికీ.. వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే స్థాయిలోనే వాటిని తగ్గించడం అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయడం, ముందుగానే భోజన ప్రణాళిక రూపొందించుకోవడం, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడం, మిగిలిన ఆహారాన్ని తిరిగి వినియోగించడం వంటి చర్యలతో ల్యాండ్‌ఫిల్‌కు చేరే వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com