శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ

- September 30, 2026 , by Maagulf
శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ

జెనీవా: మిడిలీస్టులో న్యాయబద్ధమైన, శాశ్వతమైన, సమగ్ర శాంతిని సాధించేందుకు రెండు దేశాల పరిష్కారం (Two-State Solution) అమలే ఏకైక మార్గమని సౌదీ అరేబియా పునరుద్ఘాటించింది.

జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 63వ సమావేశం సందర్భంగా పాలస్తీనా, ఇతర ఆక్రమిత అరబ్‌ ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితిపై జరిగిన సాధారణ చర్చలో సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హ్యూమానిటేరియన్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సలేం అల్-ఖహ్తానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాలస్తీనా ప్రజలకు తమ ఆత్మనిర్ణయ హక్కు ఉందని, 1967 సరిహద్దుల ఆధారంగా తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసుకునే హక్కును సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. గాజా స్ట్రిప్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులను అల్-ఖహ్తానీ తీవ్రంగా ఖండించారు. కాల్పుల విరమణను కొనసాగించడంతో పాటు పౌరులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్ కార్యకలాపాల విస్తరణ, సెటిలర్ హింసను కూడా ఆయన ఖండించారు.


పాలస్తీనా ప్రజలను బలవంతంగా తరలించే చర్యలు, ఆక్రమిత పాలస్తీనా భూభాగం భౌగోళిక లేదా జనాభా స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలను సౌదీ అరేబియా పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పలు దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించేందుకు తీసుకున్న చర్యలను సౌదీ అరేబియా స్వాగతిస్తోందని తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లతో వాణిజ్యంపై ఆంక్షలు వంటి జవాబుదారీతనాన్ని పెంచే చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు.

రెండు దేశాల పరిష్కారం అమలుకు సంబంధించిన గ్లోబల్ అలయన్స్ సహాధ్యక్షుల ప్రకటనలో పేర్కొన్న వైఖరిని కూడా సౌదీ అరేబియా పునరుద్ఘాటించింది. గాజా, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం సహా మొత్తం ప్రాంతం ఒకే పాలస్తీనా భూభాగంగా ఉండాలని, ఆక్రమణ ముగియాలని సౌదీ అరేబియా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com