బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!

- September 30, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!

మనామా: సోషల్ మీడియాలో బహ్రెయిన్‌పై దాడులను సమర్థిస్తూ, ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్టు చేసిన వ్యక్తికి బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే BD2,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది.

ఎలక్ట్రానిక్ క్రైమ్స్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు ఒక సోషల్ మీడియా ఖాతాను గుర్తించడంతో ఈ కేసు ప్రారంభమైంది. ఆ ఖాతాలో బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడులను సమర్థించే, ప్రోత్సహించే చిత్రాలు, వీడియోలు, వ్యాఖ్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దర్యాప్తులో ఆ సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని విచారించడంతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. కేసులో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను సాంకేతిక నిపుణులతో పరిశీలింపజేసింది. దర్యాప్తు, సాంకేతిక పరిశీలనలో నిందితుడు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, కస్టడీలో ఉన్న అతడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హై క్రిమినల్ కోర్టుకు తరలించింది.

కోర్టులో జరిగిన పలు విచారణల్లో నిందితుడికి తన వాదన వినిపించేందుకు చట్టపరమైన అవకాశం కల్పించారు. అనంతరం కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, BD2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

అభిప్రాయ వ్యక్తీకరణ, భావ ప్రకటనకు చట్టం రక్షణ కల్పిస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అయితే వాటిని చట్టపరమైన పరిమితుల్లోనే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఉగ్రవాద చర్యలను సమర్థించే, ప్రచారం చేసే లేదా ప్రోత్సహించే కంటెంట్‌ను ప్రచురించడం లేదా షేర్ చేయడం బహ్రెయిన్ చట్టాల ప్రకారం క్రిమినల్ నేరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com