ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!

- October 06, 2026 , by Maagulf
ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!

ఫుజైరా: ఇంటి వద్ద ఉన్న బావిలో చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ పడిపోయిన ఘటనలో ఇద్దరూ సురక్షితంగా ఉన్నట్లు ఫుజైరా సివిల్‌ డిఫెన్స్‌ అధికారులు తెలిపారు.  ఫుజైరా సివిల్‌ డిఫెన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కల్నల్‌ ఖాలిద్‌ రబీ అల్‌ హమ్మౌది చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు.

 చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినందుకు కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం ఫుజైరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డొమెస్టిక్ వర్కర్ను కూడా ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మానవతా పరమైన ఘటనల్లో బాధిత కుటుంబాలను పరామర్శించడం, వారి పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా ఫుజైరా సివిల్‌ డిఫెన్స్‌ తన సామాజిక బాధ్యతను కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.

బావుల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి
ఇళ్ల యజమానులు, వ్యవసాయ క్షేత్రాల యజమానులు, భూముల యజమానులు తమ పరిధిలోని బావులను సురక్షితంగా మూసివేసి, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సివిల్‌ డిఫెన్స్‌ సూచించింది. బావుల చుట్టూ స్పష్టమైన అడ్డంకులు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది. తెరిచి ఉన్న బావులు చిన్నారులతో పాటు పెద్దలకు కూడా తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయని హెచ్చరించింది. ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సివిల్‌ డిఫెన్స్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com