సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!

- October 06, 2026 , by Maagulf
సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!

రియాద్‌: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని కోరింది.  ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న లోతట్టు ప్రాంతాలు, లోయలు, వాగులకు దూరంగా ఉండాలని సివిల్‌ డిఫెన్స్‌ సూచించింది. ఇలాంటి ప్రాంతాల్లో ఈతకు వెళ్లవద్దని హెచ్చరించింది. వాతావరణ పరిస్థితులకు సంబంధించి అధికారిక మీడియా, సోషల్‌ మీడియా వేదికల ద్వారా విడుదలయ్యే సూచనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.

జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ప్రకారం.. మక్కా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆకస్మిక వరదలు, వడగళ్ల వాన, దుమ్ము తుపాన్లు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. మక్కా నగరంతో పాటు అల్‌-కామిల్‌, అల్‌-జుముమ్‌, బహ్రా, తాయిఫ్‌, మైసాన్‌, అధమ్‌, అల్‌-అర్దియాత్‌ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. అలీథ్‌, ఖున్‌ఫుదా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అదేవిధంగా జిజాన్‌, అసీర్‌, అల్‌-బహా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు, వడగళ్ల వాన, బలమైన గాలుల కారణంగా దుమ్ము లేచే పరిస్థితులు ఏర్పడవచ్చని NCM తెలిపింది. మదీనా, హాయిల్‌, టబూక్‌, అల్‌-జౌఫ్‌, నార్తర్న్‌ బోర్డర్స్‌ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అధికారుల భద్రతా సూచనలను పాటించాలని సివిల్‌ డిఫెన్స్‌ మరోసారి సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com