దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- October 07, 2026
దుబాయ్: దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఒకే నివాస యూనిట్‌లో కుటుంబాలు, వ్యక్తులు కలిసి ఉండేందుకు అనుమతి ఉండదు. షేర్డ్ హౌసింగ్‌లోని ప్రతి యూనిట్‌ను కుటుంబాలు లేదా వ్యక్తులు అనే రెండు వర్గాల్లో ఏదో ఒకదానికి మాత్రమే కేటాయించాలి.
దుబాయ్ మున్సిపాలిటీ Law No. 4 of 2026 కింద ఈ నిబంధనలను రూపొందించింది. షేర్డ్ హౌసింగ్ ఆక్యుపెన్సీ, నిర్వహణను నియంత్రించే ఈ చట్టం ఆగస్టులో అమల్లోకి వచ్చింది. ఇప్పటికే షేర్డ్ హౌసింగ్‌గా వినియోగిస్తున్న భవనాలు, విల్లాలు కొత్త నిబంధనలకు అనుగుణంగా మారేందుకు యజమానులు, సంస్థలకు ఒక సంవత్సరం గడువు ఇచ్చారు.
* కుటుంబాల కోసం కేటాయించిన షేర్డ్ హౌసింగ్‌లో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు ఉండవచ్చు. అయితే ప్రతి కుటుంబానికి ప్రత్యేక బెడ్‌రూమ్, ప్రైవేట్ బాత్‌రూమ్ ఉండాలి.
* వ్యక్తుల కోసం కేటాయించిన వసతుల్లో ఒక గదిలో పలువురు ఉండేందుకు అనుమతి ఉంటుంది. అయితే నిర్దేశించిన గరిష్ఠ ఆక్యుపెన్సీ పరిమితులు, ఆరోగ్య మరియు సాంకేతిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
ఒక్కొక్కరికి కనీసం 5 చదరపు మీటర్ల స్థలం
కొత్త నిబంధనల ప్రకారం బెడ్‌రూమ్‌లో ఒక్కో వ్యక్తికి కనీసం 5 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. అలాగే ప్రతి నలుగురు నివాసితులకు కనీసం ఒక పూర్తి బాత్‌రూమ్ అందుబాటులో ఉండాలి. ఇందులో వాష్‌బేసిన్, టాయిలెట్, షవర్ ఉండాలి. బాత్‌రూమ్ సౌకర్యాలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తే వ్యక్తుల కోసం ఉన్న వసతుల్లో ప్రతి నలుగురికి కనీసం ఒక టాయిలెట్, ప్రతి ఆరుగురికి కనీసం ఒక షవర్ ఉండాలి.
ప్రధాన రోడ్లపై వ్యక్తుల షేర్డ్ హౌసింగ్‌కు నో
టూరిజం లేదా వాణిజ్య ప్రాధాన్యత ఉన్న కొన్ని ప్రధాన రహదారులపై వ్యక్తుల కోసం షేర్డ్ హౌసింగ్‌ను ఏర్పాటు చేయడాన్ని మున్సిపాలిటీ నిషేధించింది.
వీటిలో బనియాస్ రోడ్, షేక్ జాయెద్ రోడ్, జుమైరా రోడ్, అల్ వసల్ రోడ్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో షేర్డ్ హౌసింగ్ అనుమతించినా అది కుటుంబాల కోసం మాత్రమే ఉండాలి.
అనుమతి తప్పనిసరి
కొత్తగా షేర్డ్ హౌసింగ్ నిర్మించినా, ఇప్పటికే ఉన్న భవనం లేదా విల్లాను షేర్డ్ హౌసింగ్‌గా మార్చినా బిల్డింగ్ పర్మిట్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్, కంప్లీషన్, షేర్డ్ హౌసింగ్ పర్మిట్ కోసం దరఖాస్తులను యజమాని నియమించిన ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ద్వారా దుబాయ్ బిల్డింగ్ ప్లాట్ ఫామ్ (Dubai Building Platform) లో సమర్పించాలి.భవనాలు, అపార్ట్‌మెంట్లు, గదుల పరిమాణాలు, నివాసితుల వర్గాలు, ఆక్యుపెన్సీ రేట్లకు సంబంధించిన వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి.
పార్కింగ్, రవాణాపైనా నిబంధనలు
షేర్డ్ హౌసింగ్‌కు సాధారణ కనీస కార్ పార్కింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. అయితే నివాసితులను తీసుకెళ్లే, దింపే మినీబస్సుల కోసం తగిన ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి RTA అనుమతి, దుబాయ్ బిల్డింగ్ కోడ్ నిబంధనల పాటింపు అవసరం. వీటితోపాటు భవనంలోని మొత్తం నివాసితుల సంఖ్యలో కనీసం 10 శాతానికి సమానంగా సైకిల్ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి.
ఓవర్‌క్రౌడింగ్‌ను అరికట్టడమే లక్ష్యం
షేర్డ్ హౌసింగ్‌ను క్రమబద్ధీకరించడం, యజమానులు–నివాసితుల హక్కులను రక్షించడం, తగిన వసతులు కల్పించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని దుబాయ్ మున్సిపాలిటీ తెలిపింది. అదేవిధంగా నివాస ప్రాంతాల్లో ఓవర్‌క్రౌడింగ్, అనధికారికంగా ఎక్కువ మంది నివసించడం, భద్రతా సమస్యలు, అనియంత్రిత షేర్డ్ హౌసింగ్‌ను తగ్గించడంతో పాటు దుబాయ్ నగర రూపాన్ని పరిరక్షించడమే ఈ నిబంధనల ఉద్దేశమని పేర్కొంది.
తాజా వార్తలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో ‘పేమెంట్ లింక్’ సేవకు త్వరలో ముగింపు..!!
- బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!
- కింగ్ ఖలీద్ విమానాశ్రయం పై బాలిస్టిక్ క్షిపణితో హూతీల దాడి
- చీటింగ్ చేస్తే ఇక వెంటనే చర్యలు లేవు.. IIT బాంబే కొత్త రూల్స్
- ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు







