విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- October 07, 2026
హైదరాబాద్: డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని తెలంగాణ గవర్నర్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. జ్ఞానం, నైపుణ్యాలు, క్రమశిక్షణ, సేవాభావంతో దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో బీఆర్‌ఏఓయూ 27వ స్నాతకోత్సవం జరిగింది.కార్యక్రమంలో గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 45 ఏళ్ల ప్రస్థానంలో 25 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేయడంలో ఓపెన్ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
మారుతున్న సాంకేతిక ప్రపంచంలో డిగ్రీ ఒక్కటే సరిపోదని గవర్నర్ అన్నారు. విద్యార్థులు జీవితాంతం స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్‌ను కొనసాగించాలని సూచించారు. కేవలం ఉద్యోగార్థులను తయారు చేయడం కాకుండా.. ఆవిష్కర్తలు, సమస్య పరిష్కారకులు, పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడమే విద్యాసంస్థల లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో ప్రముఖ ఆవిష్కరణ కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు.
యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. చెడు సహవాసం, క్షణిక ఆకర్షణలు యువత జీవితాలను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే ప్రయత్నం ప్రారంభించాలని సూచించారు.
విద్యార్థులు సాధించిన విజయాలను సమాజం, రాష్ట్రం, దేశ అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. జ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, సేవాభావంతో కూడిన యువతే వికసిత్ భారత్ - 2047కు బలం అని అన్నారు. యువత ఆలోచనలు, నాయకత్వం, సానుకూల దృక్పథం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
బీఆర్‌ఏఓయూ 27వ స్నాతకోత్సవంలో వివిధ కోర్సుల్లో 36,145 మంది విద్యార్థులకు డిగ్రీలు, పీజీ డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. 38 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు, 23 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ డిగ్రీలు, ఒకరికి ఎంఫిల్ డిగ్రీ అందజేశారు.
అందరికీ విద్యను అందించాలన్న విశ్వవిద్యాలయ లక్ష్యంలో భాగంగా 27 మంది ఖైదీలు కూడా డిగ్రీలు అందుకున్నారు. వీరిలో 26 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. చెర్లపల్లి, రాజమహేంద్రవరం, కడప సెంట్రల్ జైళ్ల నుంచి వారు విద్యను పూర్తి చేశారు.సినీ రంగానికి, సమాజానికి చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు బి. నర్సింగ్‌రావుకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
పట్టాలు, స్వర్ణ పతకాలు అందుకున్న విద్యార్థులు, పరిశోధకులు, వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో బీఆర్‌ఏఓయూ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, మాజీ నాక్ డైరెక్టర్, మాజీ బీఆర్‌ఏఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ లు ప్రసంగించారు . కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ గ్రహీత బి.నర్సింగ్‌రావు, ప్రభుత్వ అధికారులు, ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు, తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విశ్వవిద్యాలయ అధికారులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో ‘పేమెంట్ లింక్’ సేవకు త్వరలో ముగింపు..!!
- బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!
- కింగ్ ఖలీద్ విమానాశ్రయం పై బాలిస్టిక్ క్షిపణితో హూతీల దాడి
- చీటింగ్ చేస్తే ఇక వెంటనే చర్యలు లేవు.. IIT బాంబే కొత్త రూల్స్
- ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు







