బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!

- October 10, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!

మనామా: బహ్రెయిన్‌లో సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగంపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెంచుతున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేందుకు దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. బహ్రెయిన్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ విషయాన్ని ప్రకటించింది. వివిధ గవర్నరేట్ల పరిధిలోని పోలీసు విభాగాల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 2026లో జారీ చేసిన నిర్ణయం నంబర్ 58 ప్రకారం నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది.

ఈ-స్కూటర్ వినియోగదారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు

1. నిర్దేశిత ప్రాంతాల్లోనే ప్రయాణించాలి: ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికారులు అనుమతించిన ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించాలి.
2. వేగ పరిమితి 25 కిలోమీటర్లు: ఈ-స్కూటర్ల వేగం గంటకు 25 కిలోమీటర్లకు మించకూడదు.
3. ఇద్దరు ప్రయాణించకూడదు: ఒక స్కూటర్‌పై అదనపు వ్యక్తిని తీసుకెళ్లడం నిషేధం.
4. ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో వెళ్లకూడదు: వాహనాల రాకపోకలకు వ్యతిరేకంగా ప్రయాణించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు.
5. హెల్మెట్ తప్పనిసరి: స్కూటర్ నడిపేవారు హెల్మెట్ ధరించడంతో పాటు నిర్దేశించిన భద్రతా నిబంధనలను పాటించాలి.
6. ఏడేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్త: ఏడేళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు లేదా నియమిత సంరక్షకుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లు నడపకూడదు.

ఉల్లంఘిస్తే జైలు శిక్ష.. భారీ జరిమానా

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు BD500 జరిమానా విధించే అవకాశం ఉందని ట్రాఫిక్ డైరెక్టరేట్ హెచ్చరించింది. ట్రాఫిక్ పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చే సూచనలను స్కూటర్ వినియోగదారులు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు ఆపమని సూచించినప్పుడు ఆగకుండా వెళ్లడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉందని తెలిపారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు సూచనలు

పిల్లలు సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉపయోగించే సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులు సూచించారు. నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్ల స్కూటర్ నడిపేవారితో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటించాలని బహ్రెయిన్ ట్రాఫిక్ డైరెక్టరేట్ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com