రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొని 11 మంది మృతి..!!

- November 24, 2026 , by Maagulf
రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొని 11 మంది మృతి..!!

రాస్ అల్ ఖైమా: యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అల్ వతన్ రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదం ఏ సమయంలో జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే సంబంధిత అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అంబులెన్స్ సేవలు, సివిల్ డిఫెన్స్, ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని భద్రపరచడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రిత్వ శాఖ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ప్రమాదంపై అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని, నిర్ధారణ కాని వార్తలు, వదంతులను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ప్రజలకు అధికారులు సూచించారు.

12 రోజుల క్రితం ఫుజైరాలో 14 మంది మృతి

ఇటీవల ఫుజైరాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి యూఏఈ ఇంకా తేరుకోకముందే మరో భారీ ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 12న షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై (E84) వరుసగా జరిగిన రెండు ప్రమాదాల్లో 14 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు.

నిర్వహణ పనుల కారణంగా రోడ్డులో కుడివైపు లేన్‌ను మూసివేసిన ప్రాంతంలో ఈ ప్రమాదాలు జరిగాయి. మొదట ఓ వాహనం నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టింది. అనంతరం రెండు షిప్పింగ్ కంటైనర్లను తీసుకెళ్తున్న మరో ట్రక్కు పలు వాహనాలను ఢీకొని బోల్తా పడింది.

ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో వెల్లడించింది. బోల్తాపడిన వాహనం ఇతర వాహనాలను ఢీకొనగా, ట్రక్కులో మంటలు చెలరేగి పక్కనున్న వాహనాలకు కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు, 10 మంది ఎమిరేటీలు సహా మొత్తం 14 మంది మరణించారు. 

ఇదే సమయంలో నవంబర్ 10న అర్ధరాత్రి ఫుజైరా-ఖోర్ ఫక్కాన్ రోడ్డుపై జరిగిన మరో ప్రమాదంలో పార్క్ చేసి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురిలో 28 ఏళ్ల ఎమిరేటీ యువకుడు, 16 ఏళ్ల అరబ్ బాలుడు మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com