కువైట్‌లో చాలెట్లలో అక్రమ కార్మికులపై చర్యలు..!!

- November 24, 2026 , by Maagulf
కువైట్‌లో చాలెట్లలో అక్రమ కార్మికులపై చర్యలు..!!
కువైట్ : కువైట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్న చాలెట్‌లలో నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని పనిలో పెట్టుకోవడం లేదా వారికి వసతి కల్పించడంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. వారి పని స్వభావం, హోదాతో సంబంధం లేకుండా నిబంధనలను ఉల్లంఘించిన కార్మికులను నియమించుకోవడం నిషేధమని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
 
ప్రభుత్వానికి చెందిన ఆస్తులను పరిరక్షించడం, ప్రజా ప్రయోజనాలను కాపాడటం, ప్రభుత్వ ఆస్తులను నిర్దేశించిన ప్రయోజనాలకే వినియోగించేలా చూడటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ప్రాపర్టీ అఫైర్స్ ద్వారా ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ నిబంధనల అమలును నిర్ధారించేందుకు సంబంధిత ప్రభుత్వ విభాగాల సమన్వయంతో తనిఖీలు, పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. 
 
చాలెట్‌లలో అక్రమంగా నివసిస్తున్న లేదా కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని పనిలో పెట్టుకున్నట్లు గుర్తిస్తే, వాటిని నమోదు చేసి సంబంధిత అధికారుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వానికి చెందిన చాలెట్‌లను వినియోగిస్తున్న వారంతా తమ వద్ద పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగ, నివాస అనుమతుల స్థితిని పరిశీలించుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఆస్తులను అనుమతించిన ప్రయోజనాలకే వినియోగించాలని, తనిఖీ బృందాలకు సహకరించాలని కోరింది.
 
ప్రభుత్వ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామని, ప్రభుత్వ ఆస్తుల సక్రమ వినియోగం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com