రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..

- November 24, 2026 , by Maagulf
రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..

రాస్ అల్ ఖైమా: రాస్ అల్ ఖైమాలో నవంబర్ 24న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 13 మందిలో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరో 26 మంది గాయపడినట్లు యూఏఈ నేషనల్ అంబులెన్స్ ధృవీకరించింది. క్షతగాత్రుల్లో 14 మందిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను భారత కాన్సులేట్ ఇప్పటికే సంప్రదించింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు కాన్సులేట్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది.

నవంబర్ 24 తెల్లవారుజామున రాస్ అల్ ఖైమా దక్షిణ ప్రాంతంలోని అల్ వతన్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 41 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, సాంకేతిక లోపం కారణంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, 26 మంది గాయపడ్డారు. మృతుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ప్రమాదంలో గాయపడిన వారిని, మృతదేహాలను వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు రాస్ అల్ ఖైమా అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టేందుకు కేసును సంబంధిత అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంబులెన్స్ సేవలు, సివిల్ డిఫెన్స్ ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ప్రమాద స్థలాన్ని భద్రపరచడంతో పాటు ట్రాఫిక్‌ను నియంత్రించి, సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించింది.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, వాహనదారులు డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రహదారిపై ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. అలాగే, ప్రమాదానికి సంబంధించి నిర్ధారణ కాని వార్తలు, వదంతులను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com